ఆ ఘనత రోహిత్ శర్మదే..

వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ శతకాల మోత మోగించాడు.. చరిత్రలో ఒకే ఒక్కడు నిలిచి అందరి చేత ఆహా అనిపించాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు శ్రీలంక ఆటగాడు సంగక్కర, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రీకీ పాటింగ్ పేరిట ఉన్న నాలుగు సెంచరీల రికార్డును చెరిపేశాడు. అంతే కాకుండా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు ఈఫీట్ సాధించేందుకు 44 ఇన్నింగ్స్ అవసరమైతే .. అందులో మూడో వంతు మ్యాచ్‌ల్లోనే హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ మాస్టర్ సచిన్ రికార్డును సమం చేశాడు. ఈ టోర్నీలో మొత్తం ఐదు సెంచరీలు చేసి 647 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ.

గతంలో సచిన్ టెండూల్కర్‌ 2003 ప్రపంచకప్‌లో 673 పరుగులు సాధించాడు. 2007 ప్రపంచకప్‌లో మాథ్యూ హెడెన్‌ 659 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్‌ నిలిచాడు. ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 92 బంతుల్లో సెంచరీ చేసి మొత్తం తన వన్డే కెరీర్‌లో 27వ శతకం నమోదుచేసుకున్నాడు రోహిత్‌ శర్మ. 2017కు ముందు 10 సెంచరీలు చేసిన రోహిత్‌ ఆతర్వాత ఆడిన 61 ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సెంచరీలు చేయడం అతడి ఫామ్‌కు నిదర్శనం నిలిచింది.

ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఘనత రోహిత్ శర్మది. టోర్నీ లీగ్ దశలో ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ ఇందులో ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో సెంచరీలతో కదంతొక్కాడు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో 180 పరుగులతో తామే నెలకొల్పిన రికార్డును రోహిత్‌, రాహుల్‌ బద్దలు కొట్టారు. ఓ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఇద్దరు భారత ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. అటు కోహ్లి తర్వాత వన్డేల్లో వరుసగా మూడు శతకాలు సాధించిన రెండో భారత క్రికెటర్‌ రోహిత్‌ నిలిచారు. శిఖర్ ధావన్‌తో కలిసి ఒకసారి 100కు పైగా పరుగులు చేశాడు రోహిత్.

మరో రికార్డుకు కూడా రోహిత్ సిద్ధం అవుతున్నారు. ప్రపంచ కప్‌లో సచిన్‌ 673 పరుగులకు రోహిత్‌ ఇంకో 26 పరుగుల దూరంలోనే ఉన్నాడు.ఈ నేపథ్యంలో మాస్టర్‌ రికార్డును బద్దలు చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి .

శ్రీలంకపై భారత్‌కిది 91వ గెలుపు. ఆస్ట్రేలియా పేరిటున్న రికార్డును టీమ్‌ఇండియా సమం చేసింది. అటు వరల్డ్ కప్‌లో 15 పాయింట్లతో అగ్రస్థానంలో టీమిండియా నిలిచింది. 14 పాయింట్లతో రెండోస్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతుంది. సెమీ ఫైనల్లో భారత్‌ ప్రత్యర్థిగా న్యూజిలాండ్‌ నిలవనుంది. మంగళవారం మాంచెస్టర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్‌ తలపనుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.