రెబల్ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ అరెస్ట్

కాంగ్రెస్‌ నుంచి సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ను IMA అవినీతి కేసులో సిట్‌ అదుపులోకి తీసుకుంది. బీజేపీ నేత యడ్యూరప్ప వ్యక్తిగత కార్యదర్శి సంతోష్‌తో కలిసి ముంబయికి పయణమైన రోషన్‌ బేగ్‌ను అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల కింద రోషన్‌ బేగ్‌ను కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. అనంతరం జులై 8న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ చేరతానని ప్రకటించారు రోషన్ బేగ్.

రోషన్ బేగ్ అరెస్ట్ విషయాన్నిసీఎం కుమారస్వామి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సిట్‌ అధికారులను చూసిన సంతోష్‌ వెంటనే అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్వర్‌ సైతం అక్కడే ఉండడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు సీఎం కుమారస్వామి..అవినీతి కేసులో ఉన్న ఓ వ్యక్తిని బీజేపీ కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీన్ని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గురువారం జరగబోయే బలపరీక్షలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రపన్నుతున్నారని కుమారస్వామి ఆరోపించారు.

సీఎం కుమారస్వామి ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రోషన్‌ బేగ్‌తో కలిసి సంతోష్‌ పయనిస్తున్నాడన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. కుమారస్వామి అవాస్తవాలతో బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఆ సమయంలో విమానాశ్రయంలో కేవలం రోషన్‌ బేగ్‌ మాత్రమే ఉన్నారని, బోర్డింగ్‌ పాస్‌లు, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి విచారణ జరపాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.