ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీట్ల కేటాయింపు వివాదం

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీట్ల కేటాయింపు వివాదం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభలో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికార , ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరీలు ఒకరి సీటులో మరొకరు కూర్చొన్నారంటూ వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రూలింగ్ ప్రకారం నడుచుకోవడం లేదంటూ అధికారపక్షం ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగింది.

అసెంబ్లీలో అధికార పక్షం తీరుపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సభా సంప్రదాయాలు మరిచి ఇష్టారీతిలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.. అధికార పక్షం మంత్రులు, సభ్యుల సీనియారిటీని బట్టి ఎలాగైతే లిస్ట్ ఇస్తారో.. అదే విధంగా ప్రతిపక్షం కూడా తమ సభ్యుల ప్రాధాన్యతను బట్టి సీట్లు కేటాయించుకునే సంప్రదాయం ఉందన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రతిపక్ష నేతలుగా సమయంలో కూడా వారి పక్కన ఎవరు కూర్చోవాలో వారే నిర్ణయించి ఇచ్చేవారని.. అదే పద్ధతి కొనసాగుతోందని గుర్తుచేశారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన సూచించిన ప్రకారమే సీట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పుడు సభానాయకుడు చెప్పినట్లు సీట్లు కేటాయింపుల చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

సీట్ల కేటాయింపులోనూ అధికార పక్షం ప్రత్యేకంగా రూలింగ్‌ ఇస్తోందని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. డిప్యూటీ ప్లోర్‌ లీడర్ల సీట్లను తాము సర్ధుబాటు చేసుకుంటుంటే వైసీపీ సభ్యులు అనసవర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన పక్కనే ఆపార్టీ నేతలు కూర్చునే వారిని గుర్తు చేశారు బుచ్చయ్య చౌదరి..

రూల్స్ ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతిది రాజకీయం చేయడం సరికాదని విమర్శించారు. సానుభూతి కోసం పాకులాడడం మంచిది కాదన్నారు . సీట్ల కేటాయింపులలో ఓ పద్దతి ఉంటుందన్నారు జగన్‌. అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సీట్ల కేటాయింపుపై పరిశీలించిన నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. దీంతో ఇరుపక్షాలు శాంతించాయి.

Tags

Read MoreRead Less
Next Story