నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. 20 దేశాల్లో బ్రాండ్ క్రియేట్ చేసిన రాజగోపాల్‌..

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. 20 దేశాల్లో బ్రాండ్ క్రియేట్ చేసిన రాజగోపాల్‌..

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. ఏకంగా 20 దేశాల్లో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి రాజగోపాల్‌. దోశకింగ్‌గా ఓ వెలుగు వెలిగారు. ఇది ఒక కోణం! మూఢనమ్మకం, పరస్త్రీ వ్యామోహం, హత్య, యవజ్జీవం, గుండెపోటు ఇది మరో కోణం. అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా మన్ననలు పొందాల్సిన రాజగోపాల్ చివరికి అత్యంత దుర్భరమైన స్థితిలో మృతిచెందారు..

తూత్తుకూడికి చెందిన రాజగోపాల్‌ 79లో చెన్నై కేకే నగర్‌లోని కామాక్షి భవన్‌ అనే హోటల్‌ కొనుగోలుచేశాడు. దానిని శరవణ భవన్‌గా మార్చాడు. నాణ్యత, శుభ్రత విషయంలో రాజీ పడకుండా కస్టమర్లకు రుచికరమైన ఆహారం అందజేయడంతో తక్కువ కాలంలో మంచి గుర్తింపు దక్కింది. వ్యాపారాన్ని తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ విస్తరించారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా 20 దేశాల్లో శరవణభవన్‌కు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు.

దోశ కింగ్‌గా గుర్తింపు పొందిన రాజగోపాల్ కు అప్పటికే వివాహమై ఇద్దరు భార్యలు ఉన్నారు. జ్యోతిషంపై ఆయనకు అపార నమ్మకం. మరో పెళ్లి చేసుకుంటే ఎక్కడికో వెళ్లిపోతారంటూ ఓ జ్యోతిషుడు ఇచ్చిన సలహా అతడి జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పింది. తన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి కుమార్తెను మూడో భార్యగా చేసుకుంటే కలిసొస్తుందన్న మాటను నమ్మాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ, అప్పటికే పెళ్లి కావడంతో ఆమె అంగీకరించలేదు. చివరి ప్రయత్నంగా... 2001లో ఆమె భర్తను చంపించాడు. దీంతో రాజగోపాల్‌తో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది. మద్రాసు హైకోర్టు తొలుత 10ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అనంతరం యావజ్జీవ శిక్షగా మారుస్తూ 2009లో తీర్పు వెల్లడించింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం కూడా మద్రాసు హైకోర్టు తీర్పునే సమర్థించింది.

జులై 7న లొంగిపోవాల్సి ఉండగా.. అనారోగ్య కారణాల రీత్యా గడువు ఇవ్వాలని సుప్రీంను కోరాడు రాజగోపాల్. ఇందుకు కోర్టు నిరాకరించడంతో ఈనెల 9న లొంగిపోయాడు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న రాజగోపాల్‌.. ఆక్సిజన్‌ మాస్క్‌తో అంబులెన్స్‌లో వచ్చారు. ఆయన్ను పుళల్‌ జైలుకు తరలించారు. 13వ తేదీన రాజగోపాల్‌కు గుండెపోటు రావడంతో స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాజగోపాల్ కన్నుమూశారు.

ఎలాంటి మచ్చలేకపోతే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిన వ్యక్తి రాజగోపాల్. కానీ అత్యాశ అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఓ నేరగాడిగా దిక్కులేని చావుకు దారితీసింది.

Tags

Read MoreRead Less
Next Story