2021 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం : మంత్రి అనిల్

2021 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం : మంత్రి అనిల్

సీఎంగా బాధ్యతలు చేపట్టాక సాగునీటి ప్రాజెక్టులపై ఫోకస్ చేసిన జగన్.. క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించారు. ప్రాజెక్టుల లెక్కల వివరాలపై అరా తీస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం..గురువారం తొలిసారి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఏరియల్ వ్యూలో ప్రాజెక్టు ప్రాంతాన్ని, అప్పర్, లోయర్ కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్ కు చేరుకొని పోలవరం నిర్మాణాన్ని పరిశీలించారు.

పోలవరం పనులపై నిపుణుల కమిటీతో ఆడిటింగ్ చేయిస్తామన్న సీఎం జగన్.. ప్రాజెక్ట్ పై పలు సందేహాలు లేవనెత్తుతూ నిర్మాణాలపై ఆరా తీశారు. అప్పర్ కాఫర్‌ డ్యామ్‌ పనులు ఎంత వరకు పూర్తయ్యాయని అడిగి తెలుసుకున్నారు. వర్షకాలం కావటంతో భారీగా వరద వస్తే..కాఫర్ డ్యామ్ నిర్మాణం కొట్టుకు పోకుండా తీసుకున్న రక్షణ చర్యలు ఏమిటి? అని ఆరా తీశారు. గోదావరిలో వరద వస్తుందని తెలిసీ సీజన్‌ ముగిశాక ఎలా నిర్మాణం చేపట్టారని అధికారులను ప్రశ్నించారు? . స్పిల్ వే నిర్మాణ పనులపై కూడా ఆరా తీశారు. అలాగే వచ్చే నాలుగు నెలల్లో ఏయే పనులు చేయగలరంటూ ముఖ్యమంత్రి ప‍్రశ్నించటంతో స్పిల్ ఛానెల్‌ ఏటిగట్లను పటిష్టపరుస్తామని సమాధానం ఇచ్చారు అధికారులు. ఇక డ్యామ్‌ పూర‍్తయిన పది నెలలలోపు హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. ఇక ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిహారాన్ని వెంటనే పరిశీలించాలని ఆదేశించారు.

జగన్ పర్యటన వివరాలు వెల్లడించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... 2021 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. నిర్వాసితులకు ఈ ఏడాదిలోగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అధికారులపై ఒత్తిడి లేకుండా అనుకున్న గడువులోగా ఏపీ వరప్రదాయనిగా చెప్పుకునే పోలవరం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణంలో పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని అంటోంది.

Tags

Read MoreRead Less
Next Story