20 ఏళ్ల నుంచి ఆ వస్తువు పొట్టలోనే..

20 ఏళ్ల నుంచి ఆ వస్తువు పొట్టలోనే..

కంట్లో నలక పడ్డా పంటిలో ఏదన్నా ఇరుక్కున్నాఅది తీసిందాకా నిద్ర పట్టదు. పొట్ట అనే డస్ట్‌బిన్‌లో నానా రకాల చెత్త పడేసి అరగట్లేదంటూ డాక్టర్ల దగ్గరకు పరిగెడుతుంటాము. అలాంటిది కావాలనే పళ్లు రుద్దుకునే టూత్ బ్రష్‌ని అమాంతం మింగేసి ఒకటి, రెండు రోజులు కాదండి.. ఏకంగా 20 ఏళ్లు కాలక్షేపం చేశాడు. ఇన్నేళ్లలో కడుపు నొప్పి, కాలు నొప్పి లాంటివి కూడా లేవనుకుంటా.. ఆసుపత్రి మొఖం చూడలేదు. కానీ ఓరోజు విపరీతంగా కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి పరిగెట్టాడు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్ ఆస్పత్రికి లి అనే 51 ఏళ్ల వ్యక్తి విపరీతమైన కడుపు నొప్పితో వచ్చాడు. స్కాన్ చేసిన వైద్యులు అతడి పొట్టలో ఉన్న వస్తువుని చూసి నిర్ఘాంతపోయారు.

ఎలా వెళ్లిందని ఆరా తీస్తే.. లి తాను 20 ఏళ్ల క్రితం ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పాడు. అప్పుడు టూత్ బ్రష్ మింగేశానని అన్నాడు. అయినా బానే ఉన్నాను అని అనుకున్నాడు. ఆ తరువాత పెళ్లైంది ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పొట్టలో బ్రష్ ఉన్నదన్న సంగతే మర్చిపోయి హ్యాపీగా తిరిగేస్తున్నాడు. కానీ ఈ మధ్య ఉన్నట్టుండి పొట్టలో నొప్పి మొదలయ్యింది. తరచుగా మూత్రాశయంలో మంట కూడా రావడంతో.. ఎందుకైనా మంచిదని డాక్టర్‌ని కలిశాడు లి. వైద్యులు సీటీ స్కాన్ చేసిన తరువాత వచ్చిన రిపోర్టును చూసి షాక్ తిన్నారు.

పొట్టలో పొడవైన వస్తువేదో కనిపిస్తోంది కానీ క్లియర్‌గా తెలియట్లేదు. వెంటనే ఆపరేషన్ చేసి తొలగించాలన్నారు. మొత్తానికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఆపరేషన్ ఆలస్యమైతే బ్రష్ లివర్‌కి తాకి ప్రాణాంతకంగా మారేదని వైద్యుడు జియాలిన్ తెలిపారు. బ్రష్‌కి ఉన్న పళ్లన్నీ ఊడిపోయి కేవలం గట్టిగా ఉన్న ప్లాస్టిక్ పదార్థం మాత్రమే మిగిలి ఉందని వైద్యులు తెలిపారు. లీ మాత్రం బ్రష్ కరిగిపోయిందని భావించాడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story