ప్రియురాలు బ్రతకదని తెలిసీ..

ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలికి ప్రాణాంతకమైన జబ్బు. మందులతో నయం కాదు.. మరికొన్ని రోజులే బ్రతుకుతుందన్నారు డాక్టర్లు. అయినా ఎక్కడో ఓ ఆశ. మంచి మందులిప్పిస్తే మామూలు మనిషి అవుతుందేమోనని.. తెలిసిన డాక్టర్లందరికీ చూపించాడు. కీమోలెన్నో చేయించాడు. అయినా ఆమెను మృత్యువు కనికరించలేదు. మరణించే ముందు ప్రియురాలు కోరిన చివరి కోర్కెను తీర్చి బరువెక్కిన హృదయంతో ఆమెను సాగనంపాడు ప్రియుడు. ప్రేమకు అసలైన నిర్వచనంగా నిలిచాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బీతీదాస్ బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. బీతీని ప్రాణంగా ప్రేమించిన సుబ్రతా కుంద్ ఈ వార్త తెలిసి కృంగిపోయాడు. బీతి కుటుంబసభ్యులకు ఆమె స్నేహితుడినని పరిచయం చేసుకున్నాడు. దేశంలోని పలు క్యాన్సర్ ఆసుపత్రులకు తిప్పాడు మెరుగైన వైద్యం అంది ఆమె కోలుకుంటుందేమోనని. అతడు తమ కూతురు పట్ల చూపిస్తున్న శ్రద్ధను గుర్తించి బీతీని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నారు.

కీమోథెరపీ చేస్తున్నప్పుడే ఆమె ఎక్కువ రోజులు బతకదన్నారు వైద్యులు. తాను బ్రతకనని తెలుసుకున్న బీతి.. ప్రియుడు సుబ్రతా కుంద్‌ను పెళ్లాడి ఆత్మసంతృప్తితో తనువు చాలించాలనుకుంది. తన కోరికను ప్రియుడితో చెప్పింది. బరువెక్కిన హృదయంతో ప్రియురాలి చివరి కోరికను తీర్చాలనుకున్నాడు సుబ్రతా కుంద్. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న బీతీ పాపిటలో సింధూరం దిద్ది భార్యగా చేసుకున్నాడు. ప్రేమించిన వాడిని పెళ్లాడానన్న త‌ృప్తితో అతడి చేతిలో చేయి ఉంచి రెండు గంటల అనంతరం బీతి కన్నుమూసింది. బీతీ తల్లిదండ్రులు కూతురిని తీసుకెళ్లి దేవుడు కొడుకు రూపంలో సుబ్రతను పంపిచి ఉంటాడని మనసుకి సర్ధి చెప్పుకుంటున్నారు. బరువెక్కిన హృదయాలతో బీతికి అంత్యక్రియలు జరిపించారు. రూపం బాలేదని పెళ్లికి నిరాకరిస్తున్న ఈ రోజుల్లో ప్రేమకు ప్రతి రూపంగా నిలుస్తూ సుబ్రతా కుంద్ చేసిన పని అభినందనీయం అని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.