ఏపీ ప్రభుత్వానికి 'రివర్స్' పంచ్

ఏపీ ప్రభుత్వానికి రివర్స్ పంచ్

ఏపీ ప్రజల జీవనాడి పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్‌ల పై షాక్‌లు తగులుతున్నాయి. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి తీరుతామని సీఎం జగన్‌ పదే పదే చెబుతున్నారు. ఇటు టీడీపీ నేతలు, అటు కేంద్రం సైతం రివర్స్‌ టెండరింగ్‌ను వ్యతిరేకిస్తున్నా జగన్‌ మాత్రం ముందుకెళ్లాలనే సంకల్పంలో ఉన్నారు.

గత చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్న నాటి సీఎం.. ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టాలెక్కించారు. వైసీపీ అధికారంలోకి రాగానే.. సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ వైపు మొగ్గుచూపారు. పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నది సీఎం అభిప్రాయం. ఇప్పటికే కాంట్రాక్టు సంస్థ నవయుగకు ప్రీక్లోజర్ నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్‌ను పోలవరం అథారిటీ వ్యతిరేకించడంతో ప్రభుత్వానికి షాక్‌ తగిలినట్టైంది.

రివర్స్‌ టెండరింగ్ పోలవరానికి శాపంగా మారుతుందని ఆ ప్రాజెక్టు అథారిటీ స్పష్టంచేసింది. వ్యయం పెరిగిపోతుందని, నిర్మాణానికి మరింత సమయం అవసరం అవుతుందని అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశానికి జలసంఘం, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు అంశాలపై దృష్టి సారించారు. కాంట్రాక్ట్‌ ఎజెన్సీల పనితీరుపై సంతృప్తి వ్యక్తమైంది. రివర్స్ టెండరింగ్‌పై జగన్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అథారిటీ సూచించింది.

పోలవరం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పు పట్టారు. అధికారంలోకి వచ్చాం కదా అని ఏదో కాస్త హడావుడి చేస్తే తప్పులేదు కానీ ఇళ్లు పీకి పందిరేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. వారికి తెలియనప్పుడు ఎవరైనా చెబితే వినాలని.. కానీ వైసీపీ ప్రభుత్వం కనీసం అది కూడా చేయడం లేదని మండిపడ్డారు. చివరికి పోలవరం అథారిటీ కూడా రివర్స్‌ టెండరింగ్‌ను తప్పుపట్టిందని.. ఇప్పటికైనా ఈ మేధావులకి తలకెక్కుతుందో లేదో అంటూ ట్వీట్‌ చేశారు చంద్రబాబు.

పోలవరం అథారిటీనే కాదు.. కేంద్ర ప్రభుత్వం కూడా రివర్స్ టెండరింగ్‌కు సానుకూలంగా లేదు. దాని కారణంగా న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఒక ఆందోళన. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంది. అదే సమయంలో వ్యయం భారీగా పెరిగిపోతుంది. కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉండడంతో.. కేంద్రమంత్రుల అభిప్రాయమూ విలువైనదే. మరి, ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచన ఎలా ఉండబోతోంది? పాత ప్రభుత్వపు అవినీతిని బయటకు తీస్తామంటూ రివర్స్ టెండరింగ్‌ కే జై కొడతారా.. మనసు మార్చుకుంటారా? చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story