తప్పుడు ఆలోచనతోనే వైసీపీ ఆ కుట్ర చేసింది : చంద్రబాబు

ఇటీవల ఏపీలో సంభవించిన వరద పరిస్థితులపై గుంటూరులోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 19 గ్రామాల్లో పర్యటించానని, వరద పరిస్థితిని సమీక్షించానని చెప్పారు. ఎక్కడ చూసినా హృదయ విదారక పరిస్థితులు కనిపించాయన్నారు. దాదాపు 53 వేల ఎకరాల పంటభూములు నీట మునిగాయని వివరించారు. వరదలపై ఏనాడూ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష చేయలేదని చంద్రబాబు ఆరోపించారు.

ఏ రిజర్వాయర్‌లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూసుకోకుండా, వాటిని నింపే ప్రయత్నం చేయకుండా ఒక్కసారిగా వరదను దిగువకు వదిలేశారని అన్నారు చంద్రబాబు. అందుకే ప్రకాశం బ్యారేజీ దిగువన లంక గ్రామాలు వరదలో మునిగిపోయాయని చెప్పారు. వరద పరిస్థితిని నియంత్రించడానికి అవకాశం ఉన్నప్పటికీ అలా చేయలేదని అన్నారు. వరద నీటితో తన ఇంటిని కూడా ముంచాలన్న తప్పుడు ఆలోచనతో వైసీపీ ఈ కుట్ర చేసిందని చంద్రబాబు ఆరోపించారు.

వరదలు వచ్చాయని రాజధానిని మారుస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు. అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ముంబయి, చెన్నై, ఢిల్లీలోనూ వరదలు వచ్చాయని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాజధానితోపాటు పోలవరాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం సృష్టించిన ఈ మ్యాన్‌మేడ్ డిజాస్టర్ వల్ల మొత్తం 53 వేల ఎకరాల భూమి ముంపునకు గురైందన్నారు చంద్రబాబు. ఇందులో 30 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలున్నాయని చెప్పారు. రైతులకు దాదాపు 3 నుంచి 4 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు పరిహారం ఇవ్వడంతోపాటు..నెలకు సరిపడా రేషన్‌ సరకులు, పొలాలు, ఇళ్లలో బురద తొలగించుకునేందుకు ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.