నిగం బోధ్ ఘాట్‌లో జైట్లీ అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం జరగనున్నాయి. నిగమ్‌ బోధ్‌ శ్మశానవాటిలో అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తారు. జైట్లీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గొప్ప స్నేహితుడి కోల్పోయానంటూ ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు జైట్లీకి నివాళులర్పించారు..

క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న జైట్లీ కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఈ నెల 9న హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి పరిస్థితి విషమంగానే ఉంది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆయన శరీరం వైద్యానికి స్పందించడం మానేసింది. జైట్లీని బతికించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జైట్లీకి భార్య సంగీత, కుమార్తె సొనాలి జైట్లీ భక్షి, కుమారుడు రోహన్‌ జైట్లీ ఉన్నారు.

జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్‌ నుంచి కైలాశ్‌ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ 11 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్తారు. పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం అంతిమ యాత్రగా బయల్దేరి మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిగమ్‌ బోధ్‌‌ శ్మశానవాటికలో జైట్లీ అంతిమ సంస్కారాలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తారు..

Recommended For You

Leave a Reply

Your email address will not be published.