ఇక వేచిచూసేది లేదు.. ఈనెల 30న..

ఇక వేచిచూసేది లేదు.. ఈనెల 30న..

ఓ వైపు రాజధానిపై మంత్రుల గందరగోళ ప్రకటనలు. రాజధాని తరలిస్తారన్న ప్రచారం జరుగుతున్నా దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఓ క్లారిటీ ఇవ్వని పరిస్థితి. మరోవైపు అన్నా క్యాంటీన్లను మూసివేశారు. అటు పోలవరంపై రివర్స్‌ టెండర్ల పేరుతో నిర్మాణాలు ఆపి వేశారు. ఇలా వరుసగా ప్రజా వ్యతిరేక విధానాలను వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తోందనేది టీడీపీ ఆరోపణ. ఇకపై వేచిచూసే ధోరణి కూడా మంచిది కాదని... వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటం చేయాలని భావిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

టీడీపీ నేతలతో టెలీకాన్పరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు... ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వినూత్న రీతిలో ధర్నాలు, ఆందోళనలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఇసుక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న టీడీపీ అధినేత.. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులందరినీ ధర్నాలో కలుపుకొని వెళ్లాలని సూచించారు. వినూత్న నిరసనలతో ప్రభుత్వ తీరును ఎండగట్టాలన్నారు చంద్రబాబు.

ఇసుకలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. ముఖ్యంగా అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక రావాణా జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలో ఇసుకను ఉచితంగా ఇస్తే.. ఇప్పుడు మట్టి, ఇసుకను కూడా వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఫైరయ్యారు.. ఇసుక వల్ల పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం అంతా రివర్స్‌లో ఉందని చంద్రబాబు ఫైరయ్యారు. అమరావతి, పోలవరం, పీపీఏలపై పెద్ద వివాదం నడుస్తోందని.. ప్రభుత్వ చర్యలతో ప్రజల్లో అలజడి మొదలైందన్నారు. ఇది టెర్రరిస్ట్‌ ప్రభుత్వంలా తయారైందని ఘాటుగా విమర్శించారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారన్నారని.. అవసరమైతే ప్రైవేటు కేసులు పెడదామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

పార్టీ నేతలతో జరిగిన చర్చలో జగన్ అవినీతిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు.. చిదంబరం తీర్పును కూడా ఇందుకు జత చేశారు.. చిదంబరంపై తీర్పులో కూడా జగన్‌ కేసుల ప్రస్తావన వచ్చిందన్నారు.. ఆర్థిక నేరాలకు రిఫరెన్స్‌గా జగన్‌ కేసులున్నాయని.. ఇంత ఘనత మన ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. న్యాయశాస్త్రం సిలబస్‌లో కూడా జగన్‌ అవినీతిని పాఠ్యాంశం చేశారన్నారు.. అలాంటి వ్యక్తి ఇప్పుడు నీతి పాఠాలు వల్లె వేస్తున్నారంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. రాష్ట్రాభివృద్ధికి గండి కొట్టడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

మరోవైపు రాజధాని వ్యవహారంపై పోరును ఉధృతం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని డిసైడ్‌ అయింది. రాజధాని రైతుల అంశంపై పలువురు పార్టీ సీనియర్లతో చర్చలు జరిపిన చంద్రబాబు... అన్ని పార్టీల్ని ఒక్క తాటిపై తీసుకొచ్చేందుకు సీనియర్లతో ఓ కమిటీ కూడా వేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు త్వరలో అన్ని జిల్లాల్లోనూ పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story