స్విగ్గీ డెలివరీ బాయ్.. ఫుడ్డుతో పాటు బీరు సప్లై చేస్తూ..

ఇంటి ఫుడ్డు బోరు కొట్టింది. బయటకు వెళ్లాలంటే బద్ధకంగా ఉంది. ఫోన్ తీసుకుని స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే కోరుకున్న ఫుడ్డు మనకళ్లముందు ప్రత్యక్షం. సరే ఎలాగూ ఫుడ్డు తీసుకొస్తున్నాడు కదా ఓ బీరు బాటిల్‌ కూడా తెమ్మంటే.. ఆహా ఏం తెలివిరా నీది.. శెభాష్ నీకిలాంటి ఐడియాలు కూడా వస్తాయా అన్న ఫ్రెండ్స్ మెచ్చుకోలు. వెరసి డెలివరీ బాయ్‌కి కాల్ చేసి ఓ వంద ఎక్కువిస్తా.. ఓ బాటిల్ పట్టుకొచ్చెయ్ గురూ అనేసరికి స్విగ్గీ బాయ్ కాదన్లేకపోయాడు. గుజరాత్ రాష్ట్రం వడోదరలో రాహుల్ సింగ్ మహీదా అనే 22 ఏళ్ల కుర్రాడు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్న బ్రహ్మచారులు ఫుడ్డు‌తో సాటు ఓ పెగ్గేస్తే మస్త్ మజా అనుకున్నారు. అదేదో స్విగ్గీ బాయ్‌కే చెప్తే తెచ్చిస్తాడేమో చూద్దాం అని ఓ ట్రయిల్ వేశారు. సరే తీసుకొస్తానని చెప్పి ఓ ఆరు మందు బాటిళ్లు కొని బ్యాగులో వేసుకున్నాడు బాయ్.

తీసుకున్న ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళుతూ పోలీసులకు దొరికిపోయాడు. ఇలా బీరు కూడా సప్లయ్ చేయడం ఇప్పుడేనా.. ఇంతకు ముందెప్పుడైనా చేశావా అంటే.. చాలా సార్లు చేశానండి.. కానీ లక్కు బాగోగ ఇప్పుడు దొరికిపోయానండి అని అమాయకంగా మొఖం పెట్టాడు. ఏదో నాలుగు డబ్బులు వస్తాయి కదా అని చేస్తున్నానండి అని చెప్పాడు. డబ్బు సంపాదించాలంటే ఇదా మార్గం అంటూ స్విగ్గీ బాయ్‌ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు. ఆర్డర్ చేసిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఇంతకీ అసలు విషయం.. గుజరాత్ రాష్ట్రంలో మద్యం బాన్. అయినా ఎక్కడ నుంచి పట్టుకొచ్చాడో.. పోలీసుల చేతిలో బుక్కయ్యాడు. అతడి బైక్, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. గుజరాత్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published.