తెలంగాణ ప్రభుత్వానికి వారం రోజుల గడువు విధించిన ..

యాదాద్రి ఆలయ శిలలపై రాజకీయ గుర్తులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తక్షణం నాయకుల బొమ్మలు, పార్టీల చిహ్నాలు, ఇతర అభ్యంతరకర గుర్తులను తొలగించాలని ఆలయ అధికారులను ఆదేశించింది. మరోవైపు శిలలపై శిల్పాల వివాదం యాదాద్రిలో పొలిటికల్ హీట్ రాజేసింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆలయాన్ని సందర్శించిన బీజేపీ నేతలు సర్కారుకు వారం రోజుల డెడ్‌లైన్ విధించారు. ఇవాళ కాంగ్రెస్ బృందం ఆలయాన్ని సందర్శించనున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి రోజంతా ఆందోళనలతో అట్టుడికింది. ఆలయంలోని ప్రాకార స్తంభాలపై కేసీఆర్, కారు బొమ్మలను చిత్రీకరించడం పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాయగిరి నుంచి యాదాద్రి వరకు బీజేపీ చేపట్టిన భారీ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బారికేడ్లను దాటుకొని కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మణ్‌తో పాటు మరికొందరిని కొండపైకి అనుమతించారు.

కేసీఆర్ పాలన నయా నిజాంను తలపిస్తోందని ఫైర్ అయ్యారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. యాదాద్రిలో స్వామి దర్శనంతోపాటు తన దర్శనం కూడా కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారా అని నిలదీశారు. ప్రభుత్వానికి వారం రోజుల గడువు ఇస్తున్నామని ఈలోగా అన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా యాదాద్రిని సందర్శించారు..రాజకీయ బొమ్మలను తీసేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.