ఏపీపై బీజేపీ పక్కా ప్లాన్.. త్వరలోనే..

ఏపీపై బీజేపీ పక్కా ప్లాన్.. త్వరలోనే..
X

దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడించాలనే పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న కమలనాథులు ఒక్కొక్క రాష్ట్రంలో పాగా వేసుకుంటూ వెళ్తున్నారు.. సౌత్‌లో ఇప్పటికే కర్నాటకలో కమలం వికసించగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.. ముఖ్యంగా ఏపీలో పార్టీ బలోపేతంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ.. ప్రభుత్వ వైఫల్యాలను పదేపదే ప్రశ్నించడం, ప్రజల్లో బలంగా తీసుకెళ్లడం ద్వారా బలపడాలని భావిస్తోంది.

2023లో జమిలి ఎన్నికలు వస్తాయని గట్టిగా చెబుతున్న బీజేపీ నేతలు.. అప్పటికల్లా రాష్ట్రంలో బలాన్ని మరింత పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వ్యూహం అధికారాన్ని కైవసం చేసుకోవడమే అయినప్పటికీ, బలమైన ప్రతిపక్షంగా అయినా మారగలమని పక్కాగా చెబుతున్నారు.. అటు ఇప్పటికే ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపిన కమల సైన్యం త్వరలోనే టీడీపీ, కాంగ్రెస్‌లోని కీలక నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉంది..అలాగే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందేమీ లేదనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

ఏపీలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగే దిశలో బీజేపీ అడుగులు వేస్తోందన్నారు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు. అభివృద్ధి విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తూ, అదే సమయంలో లోపాలను ఎత్తి చూపాల్సిన నైతిక బాధ్యత కూడా ప్రతిపక్షానికి ఉందన్నారు.. బీజేపీ ఆ బాధ్యతను నిర్వర్తించాలనే క్రియాశీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో ముందుంటామని.. పనిచేసే, ఉద్యమించే ప్రతిపక్షంగా ఉంటామని మురళీధరరావు తెలిపారు. తాము పోలవరానికి, రాజధానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు.

Tags

Next Story