సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలం : టీడీపీ నేతలు

గోదావరి బోటు ప్రమాదం జరిగి వారం రోజులయినా.. ఇంకా 16 మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది. నదిలో సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు. 250 అడుగుల లోతులో బోటును గుర్తించినా.. వరద ప్రవాహంతో బయటకు తీయడం కష్టసాధ్యంగా మారిందన్నారు అధికారులు. చర్యలను అధికారులు నిలిపివేసిన నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. తిరిగి వెళ్లిపోయాయి. అటు కచ్చులూరు పరిసరాల్లో 144 సెక్షన్‌‌ను పోలీసులు విధించారు. ఇప్పటి వరకు 35మృతదేహాలు లభ్యం కాగా.. వాటిని అప్పగించడంలో జాప్యం చేస్తున్నారని రోడ్డుపై భైఠాయించి కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గోదావరి బోటు ప్రమాద సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమ ఆరోపించారు. రాజమండ్రి ప్రభుత్వాసుప్రతిని సందర్శించిన టీడీపీ నేతల బృందం.. బోటు ప్రమాద బాధితులను పరామర్శించి సహాయక చర్యలపై ఆరా తీశారు. బోటు వెలికితీత చర్యలు ఆపేశారని..రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్‌ను కూడా తీసివేయడం దారుణమని టీడీపీ నేతలు మండిపడ్డారు.

గోదావరిలోంచి బోటు బ యటకు తీస్తే అక్రమాలు బయటపడతాయనే ప్రభుత్వం భయపడుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని.. అందుకే బోటు తీయడం లేదన్నారు. బోటులో ఎంతమంది ఉన్నారనేదానిపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు. పోర్టు అధికారి ఒక్కొక్క బోటు నుంచి 2లక్షలు మామూళ్లు తీసుకుని అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. వారం రోజులుగా మృతదేహాలు కోసం కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారన్నారు.

బోటు ప్రమాదంలో 27మంది ప్రాణాలతో బయటపడడం వెనకాల అక్కడి కచ్చలూరు మత్స్యకారుల కృషిని గుర్తు చేసుకోకతప్పదు. నదిలో కొట్టుకుపోతూ ఆర్తనాదాలు చేస్తున్న అభాగ్యులకు ఆపన్న హస్తం అందించారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకి బాధితులను ఒడ్డుకు చేర్చారు. ఇంకా చెప్పాలంటే వారికి పునర్జన్మను ప్రసాదించారు కాచులూరు మత్య్సకార గ్రామస్తులు.

Tags

Read MoreRead Less
Next Story