ఆ ముద్రను చెరిపివేసిన రోహిత్

ఆ ముద్రను చెరిపివేసిన రోహిత్

హంటింగ్‌ గ్రౌండ్‌లో రోహిత్‌ అదరగొట్టాడు. సఫారీలను ఉతికి ఆరేశాడు. తనకు అచ్చొచ్చిన విశాఖలో మరోసారి విజృంభించాడు. తొలి టెస్టులో సెంచరీతో కదం తొక్కాడు. వర్షం కారణంగా ఆట త్వరగా ముగించాల్సి వచ్చింది. ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా టీమిండియా 202 పరుగులు చేసింది.

ఓపెనర్‌గా రాణిస్తాడా అని అనుమానించిన వాళ్లకు రోహిత్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన తొలి మ్యాచ్‌లోనే శతక్కొడుతూ విశ్వరూపం ప్రదర్శించాడు. పరిమిత ఓవర్ల క్రికెటర్‌గా ఉన్న ముద్రను చెరిపివేశాడు. కేవలం 154 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్ల తో సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్‌గా వన్డేల్లో, టీ-20ల్లో, టెస్ట్‌లలో సెంచరీ సాధించిన ఏకైక భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఓపెనర్‌గా వచ్చిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయకుండా స్వదేశంలో సెంచరీ చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో కూడా రోహిత్ చోటు దక్కించుకోవడం విశేషం.

మొదట్లో చాలా ఓపికగా ఆడాడు రోహిత్ శర్మ. లంచ్‌ విరామం వరకే హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు. ఆ తర్వాత దూకుడు పెంచాడు.. క్రీజులో కుదురుకున్నాక చెత్త బంతులన్నిటినీ బౌండరీకి తరలించాడు. లంచ్‌ తర్వాత మరించ రెచ్చిపోయిన రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకప్పటి ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తుచేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.

రోహిత్‌కి మయాంక్ కూడా మంచి మద్దతు ఇచ్చాడు. మయాంక్‌ 183 బంతుల్లో 84 పరుగులు చేశాడు. మొదటి రోజు ఆట వర్షం కారణంగా త్వరగా ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ 59.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. సఫారీలను ఉతికారేసిన రోహిత్, మయాంక్‌ల జోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story