పాకిస్తాన్‌కు బ్రిటన్‌ హైకోర్టు షాక్‌

పాకిస్తాన్‌కు బ్రిటన్‌ హైకోర్టు షాక్‌

బ్రిటన్ హైకోర్టు పాకిస్తాన్‌కు షాకిచ్చింది. నిజాం సొమ్ము భారత్‌దేనంటూ తీర్పు ఇచ్చింది. బ్రిటన్ బ్యాంకులో దశాబ్దాలుగా మూలుగుతున్న నిజాం సొమ్ముపై ఎట్టకేలకు తుది తీర్పు వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న సుదీర్ఘ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఆ నిధులు నిజాం వారసులకే చెందుతాయని జస్టిస్ మార్కస్ స్మిత్ తీర్పు చెప్పారు. ఈ నిధుల్ని భారత్‌కు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఆ నిధులు ఆయుధ నౌకల చెల్లింపుల కోసం ఉద్దేశించినవని, తమకు బహుమతిగా వచ్చినవని పాకిస్తాన్ వినిపించిన వాదనలను బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. పాకిస్తాన్ వాదనలో పస లేదని.. ఆ డబ్బులు భారత్‌కే చెందుతాయని స్పష్టం చేసింది.

1947లో భారతదేశ విభజన సమయంలో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో కలపాలా? లేక పాకిస్తాన్‌లో కలపాలా? అని ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ సంశయంలో ఉన్నారు. ఆ క్రమంలోనే 1948లో నిజాం..బ్రిటన్‌లోని పాకిస్థాన్‌ హై కమిషనర్‌ హబీబ్‌ ఇబ్రహీం రహముతుల్లాకు 10 లక్షల పౌండ్లు బదిలీ చేసి, భద్రంగా ఉంచాలని కోరారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లో ఈ నిధులు ఉన్నాయి. వడ్డీతో కలిపి ఇప్పుడు ఆ సొమ్ము 3.5 కోట్ల పౌండ్లకు చేరాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు 3 వందల 5 కోట్ల 91 లక్షలు. ఆ డబ్బు తమకే చెందుతుందని నిజాం వారసులు ప్రిన్స్‌ ముకరంజా, ముఫఖంజా వాదించారు. వారికి భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది.

పాకిస్తాన్ మాత్రం నిజాం సొమ్ము తమదేనని వాదిస్తూ వచ్చింది. ఈ కేసును అక్కడి కోర్టు జడ్జి జస్టిస్‌ మార్కస్‌ స్మిత్‌ తాజాగా రెండు వారాల పాటు విచారించారు. ఇరువర్గాల వాదనలు విన్నారు. బుధవారం తుది తీర్పు వెల్లడించారు. నిజాం నిధులపై ఇండియా-పాకిస్తాన్ మధ్య వివాదం జరిగిన సమయంలో నిజాం వారసులు చిన్నపిల్లలుగా ఉన్నారు. ఇప్పుడు వారి వయస్సు 80 ఏళ్లు. కోర్టు తీర్పును నిజాం వారసులు స్వాగతించారు. 70 ఏళ్ల తమ పోరాటం ఫలించిందని.. హర్షం వ్యక్తం చేశారు. నిజాం ఆస్తులపై బ్రిటన్‌ హైకోర్టు తాజాగా వెలువరించిన ఈ తీర్పు అంతర్జాతీయ వేదికపై పాక్‌కు మరో చేదు అనుభవంగా మిగిలింది.

Tags

Read MoreRead Less
Next Story