లోన్లు తీసుకునేవారికి పండగ కానుక ప్రకటించిన ఆర్బీఐ

లోన్లు తీసుకునేవారికి పండగ కానుక ప్రకటించిన ఆర్బీఐ

లోన్లు తీసుకునేవారికి పండగ కానుక ప్రకటించింది ఆర్బీఐ. గృహ, వాహన, కార్పొరేట్‌ రుణాలు చౌకగా లభ్యమయ్యేలా వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించింది. రెపో, రివర్స్ రెపో రేటును మరో పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 5.40 శాతంగా ఉన్న రెపో రేటును పావుశాతం తగ్గించి 5.15 శాతంగా నిర్ణయించింది. రివర్స్ రెపో రేట్ ను 4.90శాతం, బ్యాంక్ రేట్ ను 5.40శాతంగా నిర్ణయించారు. దీంతో వడ్డీ రేట్లు మరింత దిగిరానున్నాయి. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణ ముప్పును దృష్టిలో ఉంచుకొనే ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వృద్ధి రేటు తిరిగి పుంజుకునే వరకు ఇలాంటి నిర్ణయాలే ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఆర్ధిక మాంద్యం ముప్పును ఎదుర్కునేందుకు సిద్ధమవుతున్న ఆర్బీఐ వ్యవస్థలో నగదు సరఫరాకు పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తోంది. ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది ఐదోసారి. ప్రస్తుత తగ్గింపుతో కలిసి ఈ ఏడాది మొత్తం 135 బేసిస్ పాయింట్లు తగ్గింది. చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రెపో రేట్ కు అనుసంధానిస్తుండడంతో రుణాలు చౌకగా లభ్యమయ్యే అవకాశం ఉంది.

వడ్డీ రేట్లను తగ్గించి ఊరడించిన ఆర్బీఐ..దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గించి షాకిచ్చింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని అంచనా వేస్తోంది. గత పాలసీ సమావేశంలో వృద్ధి రేటును ఆర్‌బీఐ 6.9 శాతంగా అంచనా వేసింది. అయితే, జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుతుందని ఆర్‌బీఐ కూడా ఊహించలేదు. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పుంజుకోకపోవడంతోపాటు, ఎగుమతులు తగ్గడమే తన అంచనాల తగ్గింపునకు కారణాలుగా పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story