జగన్‌కు.. మోదీ రెడ్‌ సిగ్నల్‌ చూపించారా?

నిన్నటి ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌కు ఆశించిన ఫలితం దక్కలేదా? రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించిన జగన్‌కు.. మోదీ రెడ్‌ సిగ్నల్‌ చూపించారా? నిన్న ప్రధానితో గంటకుపైగా సమావేశమైన జగన్‌ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతుభరోసా కార్యక్రమాన్ని ఈ నెల 15న ప్రారంభించేందుకు.. నెల్లూరు రావాలంటూ ప్రధాని మోదీని సీఎం జగన్‌ ఆహ్వానించారు. అయితే జగన్ ఆహ్వానంపై ప్రధాని మోదీ నుంచి ఎలాంటి హామీ రానట్లు తెలుస్తోంది. అందుకు మోదీ అంగీకరించకపోవచ్చని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

జగన్‌ ఢిల్లీ రావడానికి రెండు రోజుల ముందే ఏపీ బీజేపీ నేతలు తమ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. జగన్‌ తన తండ్రి వైఎస్సార్‌ పేరిట రైతు భరోసా పథకం పెట్టారని.. దాని కింద ఒక్కో రైతుకు ఏటా 12 వేల 500 చెల్లిస్తానని ప్రకటించారని.. అందులో 6 వేలు కేంద్రం రైతుకు ఇస్తున్నవేనని.. కానీ మొత్తం 12 వేల 500 తానే ఇస్తున్నట్లు జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారని ఏపీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. సొమ్ము మనది ప్రచారం ఆయనకా అని వారు జగన్‌ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని రాష్ట్రానికి వచ్చి రైతు భరోసా ప్రారంభిస్తే బీజేపీకి రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని ఆ పార్టీ ఏపీ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. రైతుభరోసా పథకం ప్రారంభానికి ఎట్టి పరిస్థితుల్లోను ప్రధాని రాకుండా చూడాలని.. లేదంటే వైసీపీ లాభపడి, బీజేపీ రాజకీయంగా నష్టపోవడం ఖాయమని గట్టిగా చెప్పినట్లు టాక్‌. ఏపీ బీజేపీ నేతలు ఇచ్చిన సమాచారాన్ని… జగన్‌ కలవకముందే మోదీకి తెలియజేశారని తెలుస్తోంది.

వీటితో పాటు ప్రత్యేకహోదా, విభజన హామీలు, నిధులపై ప్రధాని నుంచి స్పష్టమైన హామీ లభించనట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు జగన్‌. మోదీతో దాదాపు గంటకుపైగా భేటీ అయినా.. మీడియా ప్రధాని ఇంటి ముందు రెండు గంటలుగా నిరీక్షించినా.. వారితో జగన్‌ ఏమీ మాట్లాడకుండానే వెనుకదిరిగారు. దీన్ని బట్టి చూస్తే ప్రధానితో భేటీలో జగన్‌కు ఆశించిన ఫలితం దక్కలేదనే తెలుస్తోంది.

తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ డిప్యూటేషన్‌పై కూడా కేంద్రం అయిష్టంగానే కనిపిస్తోంది. జగన్‌ ప్రధానిని కలిసే సమయంలో సీఎం వెంటే ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ కూడా ఉన్నారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆమె.. ఆంధ్రలో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు అనుమతివ్వాలని జగన్‌ కోరగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. అయితే ప్రధాని పరిధిలోని డీవోపీటీ ఆమె డిప్యుటేషన్‌కు అనుమతివ్వడానికి విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Recommended For You