ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్.. జగన్ నిర్ణయంపై స్పందన

ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్.. జగన్ నిర్ణయంపై స్పందన

ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యం కేసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. విచారణ అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అటు.. కోటంరెడ్డి అరెస్టు నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మేజిస్ట్రేట్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిపై 290, 506, 448, 427 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఏ1గా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఏ2గా బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని పేర్కొన్నారు. తెల్లవారుజామున కోటంరెడ్డిని ఆయన నివాసం నుంచి అరెస్టు చేసి తీసుకొచ్చాక.. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసుకు సంబంధించిన ప్రక్రియంతా పూర్తి చేసి జడ్జి ముందు హాజరుపరిచారు.

తన అరెస్టుపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తాను MPDO ఇంటికి వెళ్లాననడం అవాస్తవమని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి నుంచే నెల్లూరులోని కోటంరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

నెల్లూరు రూరల్‌లో ఎన్నికల తరువాత నుంచి జరిగిన ఘటనలు ఇప్పటికే తీవ్ర కలకలం రేపాయి. వీటికి తాజా వివాదం తోడవడంతో.. YCP ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. నిన్న ఢిల్లీ టూర్ ముగించుకుని అమరావతి చేరుకున్న ముఖ్యమంత్రి.. MPDOపై దాడి వ్యవహారంపై ఆరా తీశారు. చట్టం ముందు అంతా సమానమేనని.. ధిక్కరించేవారెవరినీ ఉపేక్షించవద్దని DGPకి స్పష్టం చేశారు. పూర్తి ఆధారాలు పరిశీలించి.. ఎలాంటి చర్యలకైనా వెనకాడవద్దని సూచించారు. CM గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పోలీసులు వేగంగానే స్పందించారు. ఇప్పటికే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు కూడా ఓ నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. వాటి ఆధారంగా MLA కోటంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళా అధికారిని దారుణంగా వేధించిన MLAపై తూతూమంత్రంగా బెయిలబుల్ కేసులు పెట్టారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

MPDO సరళపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యాన్ని నిరసిస్తూ నెల్లూరులో ఇప్పటికే నిరసనలు మిన్నంటాయి. ఉద్యోగ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. మండల పరిషత్ ఆఫీసుల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అటు, MPDOపై MLA దాడిని ట్విట్టర్‌తో తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో పోలీసింగ్‌ ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఇవేమీ కనబడటం లేదా అని నిలదీశారు. గతంలో ఇదే ఎమ్మెల్యే ఓ ముస్లిం మైనారిటీ జర్నలిస్ట్‌ను ఫోన్‌లో చంపుతానని బెదిరించారని గుర్తు చేశారు.

సరళ MPDOగా పని చేస్తున్న వెంకటాచలం మండలంలోని గొలగమూడి వద్ద ఓ వైసీపీ నాయకుడికి లే అవుట్ ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోకి వచ్చే లేఔట్‌లో తాగునీటి పైపులైన్లతోపాటు ఇతర సౌకర్యాల కోసం అనుమతులు 2వ తేదీ లోగా ఇవ్వాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆదేశించారు. కొన్ని కారణాల వల్ల పనులు పూర్తి కాకపోవడంతో పర్మిషన్ నిరాకరించినందుకు.. MLAతోపాటు ఆయన వర్గీయులు తనను దూషించారని, తన కుటుంబ సభ్యుల్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారంటూ సరళ ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన రోజు ఆమె ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పోలీసులు తీవ్ర తాత్సారం చేశారు. చివరికి సరళ PS ముందే.. 5 గంటలపాటు వేచి చూశాక చివరికి కంప్లైంట్ తీసుకున్నారు. ఆ కంప్లైంట్ కాపీలో ఏం జరిగిందో స్పష్టంగా వివరించారు MPDO సరళ. ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు, నియామకాల్లో తాను బిజీగా ఉన్నందున పైప్‌లైన్‌ కనెక్షన్ మంజూరు ఆలస్యమైందని.. దీనికే తన ఇంటిపై దౌర్జన్యం చేశారని సరళ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story