పాకిస్తాన్‌లో మళ్లీ మిలిటరీ పాలన.. ఇమ్రాన్ డౌటేనా?

పాకిస్తాన్‌లో మళ్లీ మిలిటరీ పాలన.. ఇమ్రాన్ డౌటేనా?

పాకిస్తాన్‌లో మళ్లీ మిలిటరీ పాలన రాబోతుందా.? పాకిస్తాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే..అలాగే అనిపిస్తోంది. ఇమ్రాన్ పర్యటనలో ఆర్మి అధికారుల దూకుడు పలు సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చైనాలో పర్యటిస్తున్నారు. అయితే.. పర్యటనకు ముందు ఇమ్రాన్‌ కొందరు ఉన్నతాధికారులు మాత్రమే ఈ బృందంలో ఉన్నారు. కానీ చివరి 24 గంటల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొందరు మంత్రులతోపాటు పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్ జావెద్‌ బజ్వానీ చైనా ట్రిప్‌కు రెడీ అయ్యారు.

ఇమ్రాన్‌ చైనా చేరుకోవడానికి ముందే ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ చైనా చేరుకుని అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇమ్రాన్‌ జరిపే చర్చల్లోనూ బజ్వానీ అక్కడే ఉండనున్నారు. ఒక సైన్యాధ్యక్షుడు ప్రధానితో కలిసి చర్చల్లో పాల్గొనడం చాలా అరుదు. కానీ పాక్ ఆర్మీ చీఫ్‌ విదేశీ విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమవుతోంది. చివరి నిమిషంలో బజ్వానీ పర్యటన బృందంలో చేరడం, దాన్ని చైనా కూడా ఆమోదించడాన్ని చూస్తుంటే ఆర్మీచీఫ్‌ పాత్ర కీలకమైందని అర్థమవుతోంది.

ఈ మధ్యకాలంలో కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా విఫలయ్యారు. దీన్ని పాక్‌ ఆర్మీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇమ్రాన్‌పై ఆర్మీ అసంతృప్తిగా ఉంది. ఇక ఆయన వల్ల వ్యవహారం తేలదని భావించి ఆర్మీనే స్వయంగా రంగంలో దిగుతోంది. ఇమ్రాన్‌ ఇదే మూసపద్ధతిలో వెళితే కష్టమని భావించి పాక్ ఆర్మీ నేరుగా జోక్యం చేసుకుంటోంది. అందులో భాగంగానే చైనాను సంతృప్తి పరిచి మద్దతు కూడగట్టేందుకు బజ్వానీ అడుగు ముందుకేశారు. దీనికి చైనా కూడా ఇమ్రాన్‌తో సమానంగా బజ్వానీకి ప్రాధాన్యత ఇచ్చింది.

పాక్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కువకాలం పాలన సాగించిన దాఖలు లేవు. ప్రభుత్వాధినేతలు ఏదో తప్పుచేస్తున్నారని బూచిగా చూపి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవడం పాక్‌ ఆర్మీకి వెన్నతో పెట్టిన విద్య. గతంలోనూ పాక్‌కు అలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్‌ ప్రభుత్వాలు కూడా ఆర్మీని కాదని ధైర్యం చేసిన సందర్భాలు దాదాపులేవు. ఇప్పటికిప్పుడు పాక్‌లో ఆర్మీ పాలన రాకపోయినా... జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆర్మీ చొరవ పెరుగుతోందని సంకేతాలు ఇస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story