అమాత్యా.. ఇవి స్కూళ్లేనా? వణికిపోతున్న విద్యార్థులు..

అమాత్యా.. ఇవి స్కూళ్లేనా? వణికిపోతున్న విద్యార్థులు..

పట్టపగలు. ఇంత ఎండలోనూ గదిలో చిమ్మ చీకటి. ట్యూబ్‌లైట్ వెలుతురు కూడా సరిపోవడం లేదు. ఇది ఒక తరగతి అంటే నమ్మగలమా! ఇదే గదిలో విద్యార్థులు కూర్చుని చదువుకోవాలి. ఈ చీకటిలోనే టీచర్లు పాఠాలు చెప్పాలి.. ఇక ఈ డోర్లు చూడండి. ఎలా విరిగిపోయాయో. మరికొన్ని క్లాస్‌ రూంలకు అసలు తలుపులే లేవు. ఇక కిటికీల పరిస్థితి చెప్పనక్కరలేదు. వానాకాలం, చలికాలం... ఇదే తరగతి గదిలో కూర్చుని వణకుతూ చదువు నేర్చుకోవల్సిన దుస్థితి చిన్నారులది. తలుపులు, కిటికీలు సరిగా లేకపోతే భద్రత ఎలా ఉంటుంది?.

తాగునీటిని అందించాల్సిన బోరు వట్టిపోయింది. టీచర్లు దయతలిస్తే పిల్లలకు మంచి నీళ్లు దొరుకుతాయి. లేదంటే చుట్టుపక్కల వెతుక్కోవల్సిందే. ఇదీ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి నియోజకవర్గమైన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల దుస్థితి. ఇలాంటి ఎన్నో సమస్యలతో నెల్లూరు జిల్లాలోని స్కూళ్లు కొట్టుమిట్టాడుతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో 400 పాఠశాలలు ఉంటే... వాటిలో 309 ప్రైమరీ స్కూళ్లు, 41 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 50 హైస్కూళ్లు ఉన్నాయి. వీటిలో చాలా పాఠశాలల్లో అరకొర వసతులే ఉన్నాయి. తరగతి గదులు లేక ఆరుబయట కూర్చొని చదువుకోవల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని స్కూళ్లు శిథిలావస్థకు చేరాయి. తాగునీటి సమస్య, మరుగుదొడ్లు, వంటశాలల కొరత వేధిస్తోంది. తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులు ఊడి ప్రమాదం పొంచవుంది. వర్షం పడితే నీరు కారుతోంది. దీంతో చిన్నారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి.

అదనపు గదులు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా పునాది గోడలు దాటలేదు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించినా సౌకర్యాల లేమితో అల్లాడుతున్నారు. మౌలిక వసతుల కొరత వల్ల ఇప్పటికే చాలా మంది ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారు. ఇక మిగిలింది పేద పిల్లలే. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న స్కూళ్లలోనే పాఠాలు నేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

గ్రామాల్లోని పాఠశాలల్లో పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏకంగా మంత్రి తీరును తప్పుపడుతున్నారు. అసలు ఇంతవరకు తాము మంత్రి ముఖం చూడలేదని కొందరు అంటుంటే.. మాకు ఎంతో ఇష్టమైన స్కూల్ ఇలా కాలగర్భంలో కలసిపోతుంటే గుండె తరుక్కుపోతుంది అంటు కంట తడి పెట్టుకుంటున్నారు. ఇక మరికొన్ని పాఠశాలలు అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయాయి.

ప్రతి ఒక్కరు తమ పిల్లలకు ఇంగ్లీష్‌ విద్య నేర్పించాలని ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లీష్‌ మీడియం ఉన్నా దీని గురించి ప్రచారం చేయకపోవడంతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదు. ప్రభుత్వం ఇకనైనా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story