హైదరాబాద్‌లో ఉగ్ర కలకలం.. ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్నీ..

హైదరాబాద్‌లో ఉగ్ర కలకలం.. ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్నీ..

హైదరాబాద్‌లో మరోసారి ఉగ్ర కలకలం రేపింది. సిమి ఉగ్రవాది అజార్‌ అలీని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆరేళ్ల క్రితం ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్నిన కేసులో తప్పించుకుని తిరుగుతున్నాడు అజార్‌. శుక్రవారం తెల్లవారుజామున సౌదీ నుంచి హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగగానే.. ఛత్తీ‌స్‌గఢ్‌ ఏటీఎస్‌ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఛత్తీ‌స్‌గఢ్‌కు తరలించారు. ఛత్తీ‌స్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌కు చెందిన అజహారుద్దీన్‌ అలియాస్‌ అజార్‌... సిమిలో స్లీపర్‌సెల్‌గా పనిచేశాడు. 2013 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్రపన్నిన ఉగ్రవాదుల్లో అజార్‌ ఒకడు. మోదీ బహిరంగ సభలో పేలుళ్లకు వీలు కాకపోవడంతో.. పట్నా, బుద్ధగయ ప్రాంతాల్లో అరగంట వ్యవధిలో 9 బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు ఉగ్రవాది అజార్‌.

పట్నా, బుద్ధగయ పేలుళ్లో 17 మందిని అరెస్టు చేయగా.. వారికి ఆశ్రయమిచ్చాడనే అభియోగాలను ఎదుర్కొంటున్న అజార్‌.. నకిలీ పాస్‌పోర్టు సాయంతో సౌదీకి పరారయ్యాడు. అలీపై లుక్ అవుట్‌ నోటీసులు ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి అతడు సౌదీ నుంచి హైదరాబాద్‌ వస్తున్నట్లు గుర్తించిన ఛత్తీ‌స్‌గఢ్‌ ఏటీఎస్‌ పోలీసులు... శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో నిఘాపెట్టారు. అతడు ఫ్లైట్‌ దిగగానే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆరేళ్లుగా సౌదీలో తలదాచుకున్న అజార్‌ హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాడు? అనే ప్రశ్న ఇప్పుడు నిఘావర్గాల్లో చర్చనీయాంశమైంది. దేశంలో ఎక్కడ ఉగ్రఘాతుకాలు జరిగినా.. మూలాలు హైదరాబాద్‌లో ఉంటాయనే అపవాదు ఉంది. ఇప్పుడు అజార్‌ అరెస్టుతో ఆ ఆరోపణలకు మరింత బలాన్నిచ్చినట్లైంది. దీంతో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. అజార్‌ హైదరాబాద్‌లో ఏమైనా కుట్రలకు పథకాలు రూపొందించాడా? ఎవరైనా అతడికి ఆశ్రయమివ్వనున్నారా? అనే కోణాలపై తెలంగాణ పోలీసులు అతన్ని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అజార్‌ను స్లీపర్‌సెల్‌గానే పోలీసులు భావిస్తున్నా.. ఇంతకు ముందు అరెస్టయిన కొందరు ఉగ్రవాదులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బట్టి చూస్తే అతడు బాంబులను తయారు చేయడంలో దిట్ట అని సమాచారం. రసాయనాలతో బాంబులను తయారు చేస్తాడనే కారణంతో.. అతడిని కెమికల్‌ అజార్‌గా పిలుస్తారని తెలుస్తోంది. అజార్‌ను న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా.. అతడికి రెండు రోజుల రిమాండ్‌ విధించారు.

Tags

Read MoreRead Less
Next Story