కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

రైతుకు పెట్టుబడి సాయం అందించే భరోసా పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి సాయాన్ని 12 వేల 5 వందల నుంచి 13 వేల 5 వందలకు పెంచింది. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి అందిస్తుండడంతో.. పథకానికి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనగా నామకరణం చేశారు. నెల్లూరు సమీపంలోని కాకుటూరులో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి‌.

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి 5 వేల 510 కోట్ల నిధులు విడుదల చేసింది. మొత్తం మూడు విడతల్లో రైతులకు సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా 40 లక్షల మంది లబ్ది పొందుతారన్నారు మంత్రి కన్నబాబు.

రైతు భరోసాపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల సమయంలో 12500లు ఇస్తానని ప్రగల్భాలు పలికి.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే 6 వేలతో కలిపి సాయం చేస్తామనడం దుర్మార్గమన్నారు.

85 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను.. సగం మందికే పరిమితం చేస్తున్నారని టీడీపీ నేతల విమర్శ. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా సాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో 12 వేల 5 వందలు ఇస్తామని చెప్పి... ఇప్పుడు 6 వేల 5 వందలు ఇస్తామంటున్నారని విమర్శించారు. మాట తప్పడం మడమ తిప్పడం అంటే ఇదే కదా అని ఎద్దేవా చేశారు పంచుమర్తి అనురాధ.

Tags

Read MoreRead Less
Next Story