పులివెందుల పంచాయితీ రాష్ట్రంలో జరగనివ్వను : చంద్రబాబు

పులివెందుల పంచాయితీ రాష్ట్రంలో జరగనివ్వను : చంద్రబాబు

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు వెళ్లారు. నాయుడుపేట, గూడూరు, నెల్లూరులో ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు. జాతీయ రహదారి నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం టీడీపీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు...

నెల్లూరు జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు తన ప్రసంగంతో కార్యకర్తల్లో జోష్ నింపారు. వైసీపీ సర్కారు తీరును ఎండగట్టారు. జగన్ పంచాయితీ పులివెందులలో జరుగుతుందేమో గానీ రాష్ట్రంలో జరగనివ్వనన్నారు. మాజీ స్పీకర్ కోడెలపై అక్రమ కేసులు పెట్టి వేధించి చంపేశారని ఆరోపించారు. సీఎంగా ఉన్నప్పుడు తాను పోలీస్ వ్యవస్థకు పూర్తి స్వేచ్చ ఇచ్చానని, ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలులు పూర్తిగా లోపించాయన్నారు.

తన బాబాయిని చంపిన హంతకుల్ని సీఎం జగన్‌ ఇంకా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్రంలో ఇసుకాసురులు ఊరికోకరు తయారయ్యారంటూ మండిపడ్డారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశారని ప్రశ్నించారు. జే-టాక్స్ పేరుతో మద్యం, లిక్కరు రేట్లు పెంచారంటూ ఫైర్‌ అయ్యారు.

రైతు భరోసా అంటూ రైతులను మోసం చేసేందుకు నెల్లూరు వస్తున్న సీఎం జగన్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ పథకానికి ఎవరు అర్హులో కూడా ప్రభుత్వం దగ్గర లెక్కల్లేవన్నారు. అమరావతి అభివృద్ధి గురించి పట్టించుకోవడమే మానేశారన్నారు. ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్‌ ఎందుకు మాట్లడ్డం లేదని ప్రశ్నించారు చంద్రబాబు. పోలవరం విషయంలో ప్రభుత్వానిది రివర్స్ కాదు.. రిజర్వ్ టెండరింగ్ అంటూ విమర్శించారాయన.

ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. కార్యకర్తల్లో జోష్‌ నింపారు టీడీపీ అధినేత. ఒకరిద్దరు పార్టీ విడినంత మాత్రాన నష్టం లేదన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దంటూ తమ్ముళ్లలో మనో ధైర్యం నింపారు.

Tags

Read MoreRead Less
Next Story