ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉద్ధృమవుతోంది. మరోవైపు… ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ఫలితం కనిపించడం లేదు. పైగా… తాత్కాలిక డ్రైవర్లు… వరుస ప్రమాదాలతో ప్రజల్ని మరింత బేంబేలెత్తిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ఆటో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

కొందరు అజాగ్రత్తతో యాక్సిడెంట్లు చేస్తుంటే.. ఇంకొందరు తాగి స్టీరింగ్ పడుతున్నారు. హైదరాబాద్ హయత్‌నగర్‌ సమీపంలోని భాగ్యలతలో ఓ డ్రైవర్.. బస్సు యూటర్న్ తీసుకునే క్రమంలో ఓ కారును ఢీకొట్టి డివైడర్‌ ఎక్కించేశాడు. బైక్‌పై వెళ్తున్న మరో వ్యక్తికి కూడా ఈ యాక్సిడెంట్‌లో గాయాలయ్యాయి. బస్ డ్రైవర్ వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఏకంగా 355 పాయింట్లు చూపించింది. పీకలవరకూ తాగిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు..

ఇక నల్లగొండలో ఓ ప్రయాణీకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బస్టాండ్‌కు వచ్చి బస్సును ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే… కాలు టైరు కిందకు వెళ్లిపోవడంతో.. కాలు తెగిపోయింది. అతన్నీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అటు.. ఆర్టీసీ బస్‌ ను మద్యం మత్తులో నడిపి… మరో బస్సును ఢీకొట్టాడు తాత్కాలిక డ్రైవర్‌. హైదరాబాద్‌ 2 డిపోకు చెందిన బస్‌ కు తాత్కాలిక డ్రైవర్‌ గా పనిచేస్తున్న వ్యక్తి ఫుల్‌గా మధ్యం సేవించాడు. మద్యం మత్తులోనే డ్రైవింగ్‌ చేస్తూ… వెనక నుంచి మరో ఆర్టీసీ బస్‌ ను ఢీకొట్టాడు. దీంతో ప్రయాణీకులు డ్రైవర్‌ ను దింపి నిలదీయగా మద్యం మత్తులో తూలుతున్నాడు. బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ చేయగా… మద్యం సేవించినట్టు తేలింది.

ఇలా ఒకటి రెండు కాదు… గత పది రోజులుగా ఇలాంటి ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి. తాత్కాలిక డ్రైవర్ల కారణంగా… ప్రయాణీకులు బలవుతున్నారు. డీజిల్‌ లేక కొన్ని, సాంకేతిక సమస్యల కారణంగా మరికొన్ని బస్సులు.. మొరాయిస్తూ.. ప్రజలకు నరకం చూపిస్తున్నాయి.

Recommended For You