లోయలో పడిన టెంపో.. ఏడుగురు దుర్మరణం

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ టెంపో లోయలో పడింది. ఈ ఘటనలో 7 మంది దుర్మరణం పాలయ్యారు. ఐదుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో రుద్రాక్షమ్మ, శ్రీనివాస్‌, వాణి , రమేష్‌, గాయత్రమ్మ, రామలక్ష్మి, గీతాలక్ష్మీలుగా గుర్తించారు.

భద్రాచలం నుంచి రాజమండ్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ప్రమాదం జరగడంతో.. అక్కడ టెలిఫోన్ కమ్యూనికేషన్‌ కూడా అందుబాటులో లేకుండా పోయింది. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు మారేడుమిల్లి నుంచి అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ టెంపోలో పర్యాటకులంతా.. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని చెలికేరి గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. రెండు టెంపోల్లో వీరు భద్రాచలం రాముడిని దర్శించుకున్న తర్వాత.. అన్నవరం బయలుదేరారు. అయితే.. ఈ సమయంలోనే వారు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాద సమయంలో.. టెంపోలో 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

మారేడుమిల్లి – చింతూరు రహదారి లోయలు, గుట్టలతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ మార్గంలో చాలా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడుపుతుంటారు. కొత్తగా వచ్చేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు స్థానికులు.

Recommended For You