వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

వేద మంత్రాలు.. మంగళవాద్యాలు.. సంప్రదాయాల మధ్య పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తుల హృదయాలు భక్తి పారవశ్యంలో ఉప్పొంగాయి. సిరిమాను రథానికి విశేష పూజలు జరిపిన తరువాత అమ్మవారి ప్రతి రూపంగా ఉన్న పూజారి బంటుపల్లి వెంకట్రావు సిరిమాను రథాన్ని అధిరోహించారు.

భక్తుల జేజేల నడుమ ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. పూర్వం పట్ట్భాషిక్తుడైన ఆనందగజపతిరాజు పతివాడ అప్పలనాయుడుకిచ్చిన తలపాగా, తురాయిని ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు ధరించి మధ్యాహ్నం ఆలయానికి వచ్చారు. హుకుంపేటలోని తన ఇంటి నుంచి బయలుదేరిన ఆలయ పూజారికి దారిపొడవునా ఘన స్వాగతం లభించింది. ముత్తయిదువులు పసుపు, కుంకుమలతో ఆయన పాదాలను అభిషేకించి, కుంకుమార్చనలు చేశారు. తరువాత సిరిమాను శిఖరాన్ని అధిరోహించారు. లక్షలాది మంది భక్తుల జై పైడిమాంబ అంటూ నినాదాలు చేయగా సిరిమాను రథం నెమ్మదిగా ముందుకు కదిలింది.

సిరిమానోత్సవం సందర్భంగా పైడితల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కరుణ, కటాక్షాలు జిల్లా ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నాను అన్నారు బొత్స.

కన్నుల పండువగా సాగిన సంబరం సాయంత్రం 5.15 గంటలకు విజయవంతంగా ముగిసింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఎటువైపు చూసినా కిక్కిరిసిన జనం కనిపించారు.

Recommended For You