టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ వివరాలివే..

గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. 13 అంశాలు అజెండాగా జరిగిన ఈ భేటీలో ప్రభుత్వంపై పోరాటం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలు వేసే అంశంపై పునరాలోచన చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి జిల్లా కమిటీలనే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. యువత , మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చనిపోయిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుతోపాటు.. గోదావరి పడవ ప్రమాద మృతులకు పొలిట్ బ్యూరో నివాళులు అర్పించింది.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది టీడీపీ పొలిట్ బ్యూరో. జగన్ పాలనలో గ్రామస్థాయిలో రోడ్డు నుంచి… పోలవరం ప్రాజెక్టు వరకు అన్ని పనులు నిలిచిపోయాయని సమావేశంలో అభిప్రాయపడ్డారు నేతలు. ఈ 4 నెలల్లో రాష్ట్ర ఆదాయం 17 శాతం తగ్గిందన్నారు. పెట్టుబడిదారులకు రాష్ట్రంపై విశ్వాసం పోయిందని పొలిట్ బ్యూరో విమర్శించింది. కియా కంపెనీ ప్రారంభోత్సవానికి సీఎం రాకపోతే ఇక పెట్టుబడులు ఎవరు పెడుతారని నేతలు ప్రశ్నించారు..

గత ప్రభుత్వం వల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపైనా సమావేశంలో చర్చించారు.. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ..ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని నిర్ణయించారు..మీడియాపై ప్రభుత్వ ఆంక్షలను తీవ్రంగా ఖండించింది పొలిట్ బ్యూరో.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే టీవీ-5, ఏబీఎన్‌ను నిలిపివేశారని అభిప్రాయపడింది.. అలాగే అయ్యన్నపాత్రుడు, వర్లరామయ్య వంటి సీనియర్ నేతలపైనా తప్పుడు కేసులు పెట్టారని సమావేశంలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు..2007లో మీడియాపై ఆంక్షల కోసం వైఎస్‌ తెచ్చిన జీవోనే..ఇప్పుడు సీఎం జగన్ తీసుకొచ్చారని అన్నారు…

గోదావరి జలాల విషయంలో జగన్ ఏకపక్షంగా వెళ్లడంవల్ల భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు వస్తాయని సమావేశం అభిప్రాయ పడింది.. ఎవరి భూభాగంలో వాళ్లే ప్రాజెక్టులు కట్టుకునేలా నిర్ణయాలు ఉండాలని అన్నారు.ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలకు శ్రేణులను సిద్ధం చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది.

Recommended For You