టీవీ5 ఛానెల్ ను పునరుద్ధరించకపోతే 23న రంగంలోకి దిగుతాం : TDSAT

టీవీ5 ప్రసారాలు వెంటనే పునరుద్ధరించాలని టీడీశాట్‌… ఏపీ ఫైబర్‌ నెట్‌ను మరోసారి ఆదేశించింది. టీవీ5 ప్రసారాలు పునరుద్ధరించే విషయంలో తమ ఆదేశాలు ఉల్లంఘించినందుకు, గతంలో విధించిన జరిమానా కొనసాగిస్తూ.. గురువారం వరకు 32 లక్షలు జమ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. టీవీ5 ఛానెల్ ప్రసారాలు పునరుద్ధరించాలన్న ఆదేశాలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించి ఏపీ ఫైబర్‌ నెట్ ప్రధాన కార్యాలయానికి పంపి ఆదేశాలు అమలు పరుస్తామని హెచ్చరించింది. ఈనెల 22 వరకూ రోజుకు 2 లక్షలు జరిమానా చెల్లించాలని కూడా పేర్కొంది.

తమ ఆదేశాలను ఏపీ ఫైబర్‌నెట్ ‌యంత్రాంగం మొదట్నుంచి ఉద్దేశపూర్వకంగానే బేఖాతరు చేస్తున్నట్టు కనిపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన TDSAT… ఇకపై ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఏటా 150 కోట్ల నష్టాల్లో ఉన్నామని చెప్తూ జరిమానా చెల్లింపును తప్పించుకునేందుకు ఏపీ ఫైబర్ నెట్ చేసిన ప్రయత్నాన్నిట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. జరిమానాలో ఎలాంటి మినహాయింపు ఉండబోదని TDSAT స్పష్టం చేసింది. తక్షణం ఛానల్ పునరుద్ధరించకుంటే జరిమానా పెంపుతో పాటు లోకల్ కమిషనర్ బృందంను పంపుతామని స్పష్టం చేసింది..

ఏపీ ఫైబర్ నెట్‌లో టీవీ5 ప్రసారాలు ఆపేసినందుకు అక్టోబర్ 1న టీడీశాట్ భారీ జరిమానా విధించింది. ఛానెల్ ప్రసారాలు పునరుద్ధరించే వరకూ రోజుకు 2 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగానే ప్రసారాలు ఆపేసినట్టు కనిపిస్తున్నదని ఘాటుగానే వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని అక్టోబర్ 1నే హెచ్చరించింది. ఐతే.. ఏపీ ఫైబర్‌నెట్ టీమ్ ఈ ఆదేశాలని పట్టించుకోలేదు.

గతంలో విచారణ సందర్భంగా ఏపీ ఫైబర్‌నెట్‌ యాజమాన్యంపై TDSAT తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. ఫ్రీ ఛానెల్ ప్రసారాలు ఆపేయడానికి సరైన కారణాలు చూపించకుండా వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వ సంస్థ అయిన టీడీశాట్‌కి పైనుంచి ఆదేశాలు ఇస్తున్న ఆ ఉన్నత వ్యక్తి ఎవరని నిలదీసింది. న్యూస్ ఛానెల్‌కు ఉండే భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ సంస్థలే ఇలా నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే.. ఇన్నాళ్లూ టీవీ5 ఛానెల్ పునరుద్ధరణపై వేచి చూసిన TDSAT.. ఈనెల 23న తామే నేరుగా రంగంలోకి దిగుతామని హెచ్చరికలు పంపింది.

Recommended For You