పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ అటాక్

పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ అటాక్

ఉగ్రవాదులపై భారత సైన్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల ధ్వంసమే లక్ష్యంగా దాడులు చేసింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న టెర్రరిస్టు క్యాంపులపై భద్రతా బలగాలు దాడి చేశాయి. సరిహద్దులు దాటకుండానే ముష్కరమూకల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించారు. ఇందుకోసం ఆర్టిలరీ గన్స్ ఉపయోగించారు. శతఘ్నుల సాయంతో బోర్డర్‌కు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశారు.

టాంగ్‌ధర్ సెక్టార్‌కు ఎదురుగా పీఓకేలోని నీలం ఘాట్‌ ప్రాంతంలో భారత సైన్యం దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైన్యానికి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు తీవ్రస్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ఆర్మీ పోస్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. టెర్రరిస్టుల లాంఛ్ పాడ్స్ పేలిపోయాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులు మృతి చెందారు. 10 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఐతే, మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

సరిహద్దుల్లో కొంతకాలంగా పాక్ సైన్యం విచ్చలవిడి కాల్పులకు తెగబడుతోంది. తాజాగా టాంగ్‌ధర్ సెక్టార్ వెంబడి పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఒక పౌరుడు కూడా మృతి చెందాడు. ముగ్గురు పౌరులు గాయపడగా, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇవన్నీ ఆర్మీకి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఎన్నిసార్లు చెప్పినా బుద్ది మారకపోవడంతో ఆర్టిలరీ గన్స్‌తో దాడులు చేసింది.

బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేపట్టిన తర్వాత సైన్యం భారీగా చేస్తున్న దాడులు ఇవే. ఇక, బాలాకోట్ దాడుల తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు ఇటీవలికాలంలో మళ్లీ ఆక్టివ్ అయ్యారు. పీఓకే వెంబడి క్యాంపులు ఏర్పాటు చేసుకొని భారత్‌లోకి చొరబడడానికి ప్రణాళిక రచించారు. వాళ్లకు పాక్ ఆర్మీతో పాటు ఐఎస్‌ఐ వర్గాల నుంచి పూర్తి సహకారం అందుతోంది. శీతాకాలాన్ని ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులను దేశంలోకి పంపించడానికి ఐఎస్‌ఐ కుట్ర పన్నింది. ఈ సమాచారమంతా సేకరించిన సైన్యం, టెర్రరిస్టులు, పాక్ ఆర్మీ పై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story