ధోనీకి సముచిత గౌరవం : బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

ధోనీకి సముచిత గౌరవం :  బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

భారత క్రికెట్‌ ఇక దాదా చేతుల్లో వచ్చింది. బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పటికే కొత్త కార్యవర్గం కొలువుదీరింది. కీలక సమయంలో అత్యంత సంపన్నమైన బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. 47 ఏళ్ల గంగూలీ తొమ్మిది నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. నిన్న జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో 39వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దీంతో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ 33 నెలల పాలన ముగిసింది.

నామినేషన్లకు ముందు వైరి వర్గాలు అన్నీ సౌరవ్‌కు మద్దతు పలికాయి. దీంతో అతడు ఒక్కడే నామినేషన్‌ దాఖలు చేశాడు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. బోర్డులో బలమైన వర్గాలైన మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌, మాజీ కార్యదర్శి నిరంజన్‌ షా తదితరులను సమన్వయం చేసుకుంటూ సాగడం దాదా ముందున్న పెద్ద సవాల్‌. ఉత్తరాఖండ్‌కు చెందిన మాహిమ్‌ వర్మ ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌సింగ్‌ ధూమల్‌ కోశాధికారిగా, కేరళకు చెందిన జయేష్‌ జార్జ్‌ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

తన కెప్టెన్సీలో జట్టును నడిపిన విధంగానే.. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా బోర్డును నడుపుతానని గంగూలీ స్పష్టం చేశాడు. ఎవరి ప్రలోభాలకు, ఒత్తిళ్లకూ లోనుకానని.. బోర్డు ప్రయోజనాల కోసం పాటుపడతానన్నాడు. బోర్డు విశ్వసనీయత, గౌరవం కాపాడే విషయంలో రాజీ పడనన్నాడు. దేశవాళీ క్రికెట్‌ అభివృద్ధికి కృషి చేస్తానని మరోసారి స్పష్టం చేశాడు.

భారత క్రికెట్‌లో అత్యంత కీలకమైన వ్యక్తి కోహ్లీ అని.. అతడికి వీలైనంతగా సహకరిస్తూ అన్ని విధాలా అండగా నిలుస్తానే కానీ.. ఇబ్బందులు పెట్టను అన్నాడు గంగూలీ. నాలుగైదేళ్లుగా టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. కోచ్‌ రవిశాస్త్రి, టీమిండియా మేనేజ్‌మెంట్‌తో కలిసి అర్థవంతమైన చర్చచేస్తానన్నాడు. అందరి ఆలోచనలకు, అభిప్రాయాలకు గౌరవమిస్తామన్నాడు. ఇవాళ కోహ్లీతో బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో దాదా మాట్లాడే అవకాశం ఉంది.

ధోనీ భవితవ్యం విషయమై సందేహాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు బీసీసీఐ కొత్త బాస్‌. రెండు వరల్డ్‌కప్‌లు అందించిన అతడికి సముచిత గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చాడు. అయితే, ధోనీ మదిలో ఏముందో తనకు తెలీదని.. మహీ ఇంతకాలం కొనసాగినందుకు దేశం గర్విస్తోందన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story