ప్రకాశం జిల్లాలో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం

ap

రాష్ట్రంలోని పాఠశాలలు, ఆసుపత్రులను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో పాఠశాలలు, ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్‌.. వారికి పలు సూచనలు చేశారు. ఈనెల 14 నుంచి నాడు-నేడు కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

సుమారు 45వేల పాఠశాలలను నాడు-నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు భవనాలకు రంగులు వేసే వరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడ వద్దన్నారు. ప్రతి స్కూల్‌లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి జాబితాను సిద్ధం చేసుకుని పారదర్శకంగా నిర్వహించేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. మొత్తం 9 రకాల పనులు ప్రతి స్కూల్లో చేపట్టాలన్నారు. మూడు దశలుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో విద్యా కమిటీలను భాగస్వామ్యం చేస్తామన్నారు.పాఠశాలలకు సంబంధించిన పరిపాలనా అంశాలతో పాటు నిర్వహణలో కూడా పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యా కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు జగన్‌.

తొలి దశలో 15వేల పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మండలంలో ఉత్తమ హైస్కూల్‌ ఎంపికచేసి జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 500 మంది విద్యార్థులు ఉన్న హైస్కూళ్లను కూడా ఈ పరిధిలోకి తేవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన నిర్వహించాలన్నారు. 2021 నాటికి 9వ తరగతికి అమలు చేయాలన్నారు.

ఇక వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకు వస్తున్నామని.. అందుకు అనుగుణంగా అధికారులు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్ 26 నుంచి ఆసుపత్రుల్లోనూ నాడు- నేడు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, బోధనాసుపత్రులలో సదుపాయాల కల్పనతో పాటు ప్రమాణాలను మెరుగుపరచాలన్నారు. ఆసుపత్రులలో మందుల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం 510 రకాల మందులు డిసెంబర్ 15 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే నెట్‌వర్క్ ఆసుపత్రులలో ప్రమాణాలు పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. వచ్చే ఏడాది జనవరిలో ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీకి క్యాలెండర్‌ అందించాలని.. మే నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.

Recommended For You