ఆగని ఆర్టీసీ సమ్మె.. పలు ప్రాంతాలలో కార్మికులు అరెస్ట్

ఆగని ఆర్టీసీ సమ్మె.. పలు ప్రాంతాలలో కార్మికులు అరెస్ట్

ts.png

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. విధుల్లో చేరేందుకు సర్కార్ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసినా.. కార్మికులు వెనక్కు తగ్గటం లేదు. కొన్ని ప్రాంతాలలో నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. బస్సు డిపోల ముందు కార్మికులు ధర్నా చేపట్టి బస్సులను అడ్డుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిపోలు, బస్టాండ్‌ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మిర్యాలగూడ బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికుల దీక్షా శిభిరాన్ని పోలీసులు తరలించారు. ధర్నా చేస్తున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై పీఎస్‌ ముందే నిరసన చేస్తున్నారు.

మరోవైపు, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘం నాయకులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఆందోళనకారులకు , పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో ఓ కార్మికులు సొమ్మసిల్లి పడిపోయాడు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

అటు, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డిపో, కోదాడ డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. తెల్లవారుజాము నుంచే విపక్ష పార్టీలతో కలిసి కార్మికులు డిపోలకు తాళం వేసి బస్సులను అడ్డుకున్నారు. భారీ బందోబస్త్ ఏర్పాటు చేసిన పోలీసులు.. కార్మికులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ సమ్మె కొనసాగిస్తామని కార్మికులు అంటున్నారు.

మరోవైపు.. సమస్య తీవ్రంకావటంతో ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు కోల్పోతున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని డిపో-2లో మెకానిక్‌గా పని చేస్తున్న కరీం ఉల్లాఖాన్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇటీవలే కరీంకు గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. కరీంనగర్‌ డిపో 2లో మెకానిక్‌గా పని చేస్తున్న కరీం ఉల్లాఖాన్.. ఆర్టీసీ సమ్మెలో నెల రోజులు పాల్గొన్నాడు. సమ్మె పరిష్కారానికి అడుగులు పడకపోవడంతో కరీం తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని.. దీంతో గుండెపోటు వచ్చినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కరీం మృతిపై కార్మికులు నివాళులర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story