సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

sonia-and-rahul.png

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబానికి SPG భద్రతను తొలగించింది హోంశాఖ. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కుటుంబానికి స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ రక్షణను ఉపసంహరించాలని నిర్ణయించారు. గాంధీ కుటుంబానికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించనున్నట్టు తెలిపింది. ఇకపై కేవలం ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఎస్‌పీజీ సవరణ బిల్లును త్వరలోనే కేంద్రం.. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

సోనియాగాంధీ భర్త రాజీవ్ గాంధీ హత్యానంతరం ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలతో అదే భద్రతను కంటిన్యూ చేశారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత SPGని తొలగించే ఆలోచనే చేయలేదు. అయితే.. ప్రస్తుతం గాంధీ కుటుంబం లోథ్రెట్ కేటగిరీలోనే ఉందని కేంద్రం భావిస్తోంది. నిఘా వర్గాలు, ఐబీ, రా వంటి సంస్థలు ఇచ్చిన నివేదిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ స్పష్టం చేసింది.

2015 నుంచి 2019 వరకు దాదాపు 18వందల సార్లు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం లేని కార్లలో రాహుల్ గాంధీ ప్రయాణించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు రాహుల్ గాంధీ కూడా SPG ప్రొటెక్షన్‌పై అనాసక్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే.. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఎస్పీజీ భద్రతను తొలగించారు. రెండు నెలల కిందటే దీన్ని అమలు చేసింది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్‌కు కూడా జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలోనే కొనసాగుతున్నారు.

కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీల ప్రాణాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. SPG భద్రత తొలగించడం వల్ల గాంధీ కుటుంబ సభ్యులను తేలిగ్గా టార్గెట్ చేసే అవకాశాలుంటాయని, వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story