అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ayodhya-verdict

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు  సంచలన తీర్పు చెప్పింది. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని స్పష్టంచేసింది. అయోధ్యపై ప్రత్యేక చట్టం చేసి.. 3 నెలల్లో ట్రస్టు ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. ఆ ట్రస్టుకు 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మరోవైపు.. ముస్లింలకు 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని, అందులో మసీదు కట్టుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయంతో ఈ తీర్పు ఇచ్చారు. దాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ చదివారు. బాబ్రీ మసీదు అంతర్లీన నిర్మాణాలు ఇస్లామిక్ సంప్రదాయంలో లేవని చెప్పారాయన. అంతర్గత నిర్మాణాలు కానీ.. కళాఖండాలు కానీ.. ఇస్లామిక్ సంస్కృతిని ప్రతిబింబించడం లేదని CJI స్పష్టంచేశారు. అదే సమయంలో.. బాబ్రీ మసీదును ఖాళీ స్థలంలో నిర్మించలేదని సూటిగా చెప్పారు. అక్కడ మందిరం లాంటి నిర్మాణం లేదని పురావస్తు శాఖ చెప్పలేదని.. మసీదు కింద ఆలయ నిర్మాణం ఉన్నట్టు నిర్ధారణ చేసినట్టు CJI తెలిపారు.

అయోధ్యను రాముడు జన్మించిన ప్రదేశంగా హిందువులు నమ్ముతున్నారని సుప్రీంకోర్టు చెప్పింది. అదే సమయంలో నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా తీర్పు చెప్పలేమని తెలిపింది. సహజ న్యాయ సూత్రాలు, ఆధారాల ప్రకారమే భూమి హక్కులు ఉంటాయని స్పష్టంచేసింది. బాబ్రీ మసీదు కింద ఆలయ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదికలో ఉందన్న సుప్రీంకోర్టు.. బాబర్ పాలనా కాలంలో ఆయన సైనికాధికారి మసీదు కట్టారని స్పష్టంచేసింది. అయితే.. మందిరాన్ని కూల్చినట్టు ఆధారాలు లేవన్నారు. 12-16 శాతాబ్దాల మధ్య ఏం జరిగిందో చెప్పడానికి ఆధారాల్లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

అందరి వాదనలు విన్న తర్వాత అంతిమ తీర్పు చెప్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చెప్పారు. తొలుత షియా వక్ఫ్‌ బోర్డు పిటిషన్‌ను తోసిపుచ్చారు. సంబంధిత స్థలానికి మేమే హక్కుదారులం అని షియా వక్ఫ్‌ బోర్డు వాదించింది. ఆ తర్వాత.. నిర్మొహి అఖాడా వాదనలు సరైనవి కావని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రతిపాదిత రామ మందిరంలో పూజా కైంకర్యాల హక్కు తమకే ఇవ్వాలని వాళ్లు వాదించారు. సున్నీ వక్ఫ్‌ బోర్డు వాదనలను మాత్రం సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే.. వివాదాస్పద స్థలంపై హక్కులకు సంబంధించిన ఆధారాలు సమర్పించలేకపోయారని CJI అన్నారు.

Recommended For You