అయోధ్య వివాదానికి కారణం..

ayodhya

అయోధ్యను శ్రీరామచంద్రుని జన్మస్థలంగా భావిస్తారు హిందువులు. రామాయణ మహాకావ్యంలోనూ అయోధ్య ప్రస్తావన ఉంది. ఐతే, ఆ స్థలం తమకు చెందినదని ముస్లింల వాదన. ఈ వివాదానికి ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్‌.. సైనిక కమాండర్ మీర్ బకీ ఇక్కడ మసీదు నిర్మించాడు. అప్పటి నుంచి బాబ్రీ మసీదు ఉనికిలోకి వచ్చింది. నాటి నుంచి అడపా దడపా రగడ చెలరేగుతూనే ఉంది. 1835-1949 మధ్య బాబ్రీపై ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 1949లో వివాదాస్పద స్థలంలో రామ్‌లల్లా విగ్రహాల ఏర్పాటు చేశారు.

వివాదాస్పద భూమిపై ఘర్షణలు చోటు చేసుకున్నా..కోర్టుకు చేరింది మాత్రం 80వ దశకంలోనే. 1981లో సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌ కోర్టును ఆశ్రయించింది. 1986లో హిందూ భక్తుల కోసం వివాదాస్పద స్థలాన్ని తెరిపించాలని ప్రభుత్వానికి స్థానిక కోర్టు ఆదేశించగా..1989 ఆగస్టు 14న అలహాబాద్‌ హైకోర్టు స్టే విధించింది. అయితే 1992 డిసెంబర్ 6న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 1993లో కేంద్రప్రభుత్వం వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అయోధ్య కేసులో ప్రభుత్వ ఆధీనంలో 67 ఎకరాలు ఉండగా అందులో 2.77 ఎకరాలపై వివాదం నెలకొంది.

1994 అక్టోబర్ 24న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మసీదు ఇస్లాంలో అంత ర్భాగం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య న్యాయ ప్రక్రియలో ఇదొక మైలురాయిగా పేర్కొంటారు. ఇక 2002 ఏప్రిల్ నుంచి అలహాబాద్ హై కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2010లో హైకోర్టు తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూభాగాన్ని రామ్‌లల్లా విరాజ్‌మాన్, నిర్మోహీ అఖాడా, సున్నీవక్ఫ్ బోర్డులకు మూడు సమాన భాగాలుగా విభజిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐతే, ఈ మూడు ముక్కల తీర్పు ఎవ్వరినీ సంతృప్తి పరచలేకపోయింది. దాంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అలాహాబాద్ హైకోర్టు తీర్పుపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది.

2017లో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. నాటి చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహార్, కోర్టు వెలుపల సెటిల్‌మెంట్‌ను ప్రతిపాదించారు. ఐతే ఇందుకు కక్షిదారులు అంగీకరించలేదు. ఇక 2017 డిసెంబర్‌లో నాటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తుది విచారణ చేపట్టారు. అప్పటికి 30కి పైగా పిటిషన్లు దాఖలు కాగా, 14 పిటిషన్లనే అనుమతించారు. 2019 ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్య వివాదాన్ని మధ్య వర్తిత్వంతో పరిష్కరించాలని సంకల్పించింది. అందుకోసం జస్టిస్ ఖలీఫుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచూలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కక్షిదారులతో రహస్యంగా చర్చలు జరిపి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఐతే, కక్షిదారులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో మధ్యవర్తిత్వం విఫలమైంది. దాంతో సుప్రీంకోర్టే రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల పాటు ఏకధాటిగా విచారణ జరిపింది. ఈ రోజూ ఉదయం 10.30 గంటలక తుది తీర్పు వెల్లడించనుంది.

Recommended For You