ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌

ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌

rtc-strike

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బ్రేకులు పడడం లేదు. ప్రభుత్వం పట్టు వీడకపోవడం.. కార్మికులు మెట్టు దిగకపోవడంతో సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో కార్మికులు హోరెత్తిస్తున్నారు. సమ్మెను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ సంఘాలు చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపిచ్చింది. మిలియన్ మార్చ్‌ తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జేఏసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు పార్టీల నేతలు కూడా చలో ట్యాంక్‌ బండ్‌కు మద్దతు తెలిపారు. దీంతో జిల్లాల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున కార్మికులు హైదరాబాద్ తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడిక్కడ కట్టడి చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలతోపాటు.. పలుపార్టీల నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డితో సహా కొందరు అజ్ఞాతంలో ఉన్నారు. మరోవైపు విద్యానగర్‌లో ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. చలో ట్యాంక్‌బండ్‌ నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. కార్మికుల ఇళ్లకు వెళ్లి మరీ పోలీసులు అరెస్టులకు దిగడాన్ని వారు ఖండించారు. అటు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌ బస్‌ భవన్‌లోకి మీడియాకు నో ఎంట్రీ అంటూ నోటీసులు అంటించారు. బస్‌ భవన్‌కు వచ్చే ప్రతి వ్యక్తిపై నిఘా పెట్టారు పోలీసులు. చలో ట్యాంక్‌బండ్‌ నేపథ్యంలో బస్‌ భవన్‌ వద్ద హై సెక్యూరిటీ ఏర్పాటుచేశారు. అలాగే రాష్ట్రంలోని 97 బస్‌ డిపోల దగ్గర భద్రతా బలగాలతో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆర్టీసీ చలో ట్యాంక్‌బంఢ్‌కు తెలంగాణ ఆటో జేఏసీ కూడా మద్దతు తెలిపింది. ట్యాంక్‌ బండ్‌పై ఈ మార్చ్‌కి తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్లంతా తరలివరావాలని పిలుపునిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story