ఇసుకపై టీడీపీ ఉద్యమం.. విపక్షాల మద్దతుకు వ్యూహం

ఇసుకపై టీడీపీ ఉద్యమం.. విపక్షాల మద్దతుకు వ్యూహం

chandrababu

రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు సహా అనేక అంశాలపై ఈనెల 14న టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్షకు సిద్ధమవుతున్నారు.. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. దీనికి సంబంధించి అనుమతుల కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో చంద్రబాబు దీక్షకు సీపీ, మున్సిపల్‌ కమిషనర్‌ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ ధర్నా చౌక్‌ను వేదికగా ఎంచుకున్నారు టీడీపీ నేతలు. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత, జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబు దీక్షకు స్టేడియంలో అనుమతులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు టీడీపీ నేతలు.

ఇక చంద్రబాబు దీక్షను సక్సెస్‌ చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నాయి. ఇటీవల జనసేనాని నిర్వహించిన లాంగ్‌ మార్చ్‌కు మద్దతు తెలిపిన టీడీపీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న దీక్షకు మిగతా పక్షాల మద్దతు కోరుతోంది. ఇందుకోసం శనివారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, జనసేన సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు ఆహ్వానాలు పంపింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం నాయకత్వంతో చర్చించిన తర్వాత సమావేశానికి హాజరు కావాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. అటు ఈ సమావేశానికి బీజేపీని టీడీపీ నేతలు ఆహ్వానించలేదు. దీనికి కారణం ఇటీవల ఇసుక కొరతపై పోరాటాలు చేసిన బీజేపీ నేతలు.. టీడీపీని ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు కమలనాథులను సంప్రదించలేదని తెలుస్తోంది. మరి, 14న చంద్రబాబు చేపట్టనున్న దీక్షకు ఎన్ని పార్టీలు మద్దతిస్తాయన్నది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story