చిన్నారి వర్షిత దారుణ హత్య ఘటనపై సీఎం జగన్ ఆవేదన

చిత్తూరు జిల్లాలో చిన్నారి వర్షిత దారుణ హత్య ఘటనపై సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అమానుష ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. హంతకుడిని త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం.
వర్షిత కేసులో పురోగతి కనిపిస్తోంది. సీసీకెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు పోలీసులు. అతడి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఆ దుండగుడిది కర్నాటకగా చెప్తున్నారు. చిన్నారిని ఫోటోలు తీస్తూ.. ఎత్తుకెళ్లినట్టు స్పష్టంచేశారు. అనుమానితుడు బ్లూ కలర్ టీషర్ట్ విత్ క్యాప్‌తో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులతో కలిసి కురబాల కోటలో ఓ పెళ్లికి వచ్చిన ఆరేళ్ల వర్షిత దారుణ హత్యకు గురైంది. కొత్తకోట మండలం గుట్టపల్లికి చెందిన సిద్దారెడ్డి కుమార్తె వర్షిత కుటుంబసభ్యులతో కలిసి బంధువుల వివాహానికి వచ్చింది. అప్పటివరకూ కల్యాణమంటపంలో సరదాగా ఆడుకుంటూ కనిపించిన వర్షిత అర్థరాత్రి కనిపించడా పోయింది. తెల్లవార్లూ వెదికినా ఆచూకీ దొరకలేదు. ఉదయం కల్యాణమంటపం సమీపంలోనే వర్షిత విగతజీవిగా పడి ఉంది.
వర్షిత దారుణ హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ఆధారంగా కీలక వివరాలు వెల్లడించారు పోలీసులు. మొదట అత్యాచారం చేసి ఆ తర్వాత ఊపిరాడకుండా చేయడం వల్లే చనిపోయిందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com