ఏపీలో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిగోల్డ్‌ రాజకీయం వేడి..

ఏపీలో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిగోల్డ్‌ రాజకీయం వేడి..

tdp-ycp

ఏపీలో వైసీపీ-టీడీపీ మధ్య అగ్రిగోల్డ్‌ రాజకీయం వేడెక్కుతోంది. ఇరు పక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. అగ్రిగోల్‌ వ్యవహారంలో రెండు రోజుల క్రితం అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని.. హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని ఆయన ఆరోపించారు. అగ్రిగోల్డ్‌తో సంబంధంలేదని చంద్రబాబు ప్రకటించగలరా? అని తమ్మినేని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.

అగ్రిగోల్డ్‌ ఆస్తులతో తనకు సంబంధం ఉందని స్పీకర్‌ చేసిన ఆరోపణలను నిరూపిస్తే.. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్‌ విసిరారు. ఒకవేళ ఆరోపణలు అవాస్తవం అని తేలితే మీరేం చేస్తారో చెప్పాలంటూ లోకేష్‌ లేఖలో డిమాండ్‌ చేశారు. సభాపతి స్థానంలో ఉండి ప్రతిపక్షనేతపైనా, మండలి సభ్యుడినైన తనపైనా నిందారోపణలు చేయడం స్పీకర్‌ స్థానానికి మంచిది కాదని హితవు పలికారు లోకేష్‌.

అటు స్పీకర్‌ తమ్మినేనిపై లోకేష్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. స్పీకర్‌కి లోకేష్ బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లోకేష్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. స్పీకర్ పదవిని దిగజార్చిన ఘనత గత చంద్రబాబు ప్రభుత్వానిదేనని విమర్శించారు వెల్లంపల్లి.

వెల్లంపల్లి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నారు. లోకేష్‌ విమర్శించే స్థాయి వెల్లంపల్లికి లేదంటున్నారు. మొత్తంగా అగ్రిగోల్డ్‌ వ్యవహరం అధికార-విపక్షాల మధ్య సెగలు రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story