తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై జనసేనాని స్పందన

pawan

ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. ట్విట్టర్‌ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారాయన. వైసీపీ నాయకత్వం తెలుగు భాష నిజమైన సంపదను అర్థం చేసుకుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను నిషేధించేందుకు ప్రయత్నించదని అన్నారు. వైసీపీ నాయకత్వం…. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. భాషను, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో కేసీఆర్‌ను చూసి తెలుసుకోవాలన్నారు. 2017లో హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌.. తెలుగు మహాసభలు నిర్వహించారని జనసేనాని గుర్తు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తీసేందుకు సన్నాహాలు చేస్తుంటే.. ఏపీ అధికార భాషా సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు పవన్‌ కల్యాణ్‌. ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియంను రద్దు చేస్తే… తెలుగు భాష సంస్కృతి మరుగున పడుతుందన్నారు. అందుకే పెద్ద బాలశిక్ష, తెలుగు వ్యాకరణం, ఆరుద్ర సమగ్ర సాహిత్యం, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి గొప్ప గొప్ప తెలుగు పుస్తకాలు తన లైబ్రరీలో భద్రపరుచుకున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాలను సైతం ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.

Recommended For You