కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు పెరిగిన ఇన్‌ఫ్లోలు

water-flow

కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు మళ్లీ పెరిగాయి. ఎగువన ఆల్మట్టి మొదలు దిగువన ప్రకాశం బ్యారేజ్‌ వరకు ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండగా.. వచ్చిన వరద వచ్చినట్టుగా కిందుకు వదులుతున్నారు అధికారులు. ఆల్మటికి 22 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తోంది. అంతే మొత్తం నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నారాయణపుర రిజర్వాయర్‌కు 33 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. జూరాల జలాశయానికి 80 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. స్పిల్‌వే ద్వారా 40వేలు, కరెంటు ఉత్పత్తి ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

తుంగభద్ర నుంచి 15 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వస్తోంది.. ఓవరాల్‌గా శ్రీశైలం రిజర్వాయర్‌కు 51వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఇక దిగువన నాగార్జునసాగర్‌కు 52 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 311.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా అంతే మొత్తాన్ని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు అధికారులు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 43 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా నమోదైంది. అటు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ జలాశయంలో 9వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. కాల్వలు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 13,500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Recommended For You