మరింత ఘాటెక్కుతోన్న ఉల్లి.. సెంచరీ దిశగా పరుగులు

మరింత ఘాటెక్కుతోన్న ఉల్లి.. సెంచరీ దిశగా పరుగులు

onion

మార్కెట్‌కు సరఫరా తగ్గిపోవడంతో కొందరు వ్యాపారులు ఇదే అదునుగా ధరలు అమాంతం పెంచేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అటు పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనడం మాట అటుంచితే చూస్తేనే ఘాటెక్కిపోతుండటంతో మార్కెట్‌లో ఉల్లివైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.

మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ కారణంగానే మార్కెట్‌కు ఉల్లి సరఫరా గణనీయంగా పడిపోయింది. హైదరాబాద్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర రూ.6 వేలు పలుకుతోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌కు కొత్త ఉల్లిగడ్డ రావాలంటే మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో కొందరు వ్యాపారులు మాత్రం నిల్వచేసుకున్న ఉల్లిని ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలకు నియంత్రణ లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అటు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అక్రమార్కులపై నిఘా పెట్టింది.. అన్ని రాష్ట్రాల్లో గోడౌన్లపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తూ కలుగులో దాగున్న సరుకును వెలుగులోకి తీసుకొస్తున్నారు. అయితే, దీనివల్ల ధరలు దిగివచ్చే పరిస్థితి లేదు. దీంతో విదేశాల నుంచి దిగుమతులకు సన్నాహాలు చేస్తోంది. నాఫెడ్‌ ద్వారా విదేశాల నుంచి ఉల్లిగడ్డ కొనుగోలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి ఉల్లిదిగుమతి జరిగితే కొంతలో కొంతయినా ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అటు ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. లక్ష టన్నుల ఉల్లిపాయలు దిగుమతి చేసుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వ్యాపార సంస్థ అయిన మెటల్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వీటిని దిగుమతి చేసుకోగా, నాఫెడ్‌ దేశీయ మార్కెట్‌లోకి సరఫరా చేస్తుంది. ఢిల్లీలో నిర్వహించిన కార్యదర్శుల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story