టీఆర్‌ఎస్ నేతల ఇళ్లను ముట్టడి చేసిన ఆర్టీసీ కార్మికులు

టీఆర్‌ఎస్ నేతల ఇళ్లను ముట్టడి చేసిన ఆర్టీసీ కార్మికులు

ts

ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన లాఠీఛార్జ్‌కు నిరసనగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల వద్ద ఆందోళన చేపట్టారు. పలుచోట్ల పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది.

38రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. డిమాండ్ల సాధనతోపాటు.. ట్యాంక్‌బండ్‌పై జరిగిన లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు ముమ్మరం చేశారు. ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్ డిపోలకు చెందిన కార్మికులు.. మలక్‌పేట తిరుమల హిల్స్‌లోని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అదే ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఇంటిని కూడా ముట్టడించారు

వరంగల్‌లో ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ ఇళ్ల ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు.. కార్మికులను అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు.

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట బస్ డిపో నుంచి అఖిలపక్షాలతో కలిసి ర్యాలీ నిర్వహించిన కార్మికులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ తోపాటు కొందరు ఆర్టీసీ కార్మికులు గాయపడ్డారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో కార్మికల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

ఖమ్మం జిల్లాలో పాల్వంచ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు.. మణుగూరులోని పినపాక ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసును ఆర్టీసీ కార్మిక సంఘాలు ముట్టడించాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకొని ముందుకెళ్లారు. సమ్మెపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని.. లేదంటే ప్రగతిభవన్‌ ముట్టడి చేపడుతామంటూ కార్మికులు హెచ్చరించారు

నల్గొండ జిల్లాలోనూ ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలోని TRS ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుతోపాటు.. ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి ఇళ్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story