రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన టీఎన్‌ శేషన్‌

tn-seshan

మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ టీఎన్‌ శేషన్ ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. తమిళనాడు కేడర్‌ నుంచి 1955 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శేషన్‌.. దేశానికి 18వ కేబినెట్‌ సెక్రటరీగా పని చేశారు. అనంతరం ఎన్నికల కమిషన్‌కు పదో సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 1996 వరకూ ఆరేళ్లపాటు ఆయన సీఈసీగా వ్యవహరించారు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి కేఆర్‌ నారాయణన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 1996లో ఆయన రామన్‌ మెగసెసె అవార్డును అందుకున్నారు.

ఎన్నికల నిబంధనావళి అమలుచేయడంలో విశేష కృషి చేశారు. ఓటర్లకు గుర్తింపు కార్డుల వ్యవస్థను తీసుకొచ్చారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై పరిమితి విధించారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, ఓటుకు నోటు ఇవ్వడం వంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఎన్నికల ప్రచారంలో అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ వాహనాలను ఉపయోగించడాన్ని నిబంధనలు కఠినతరం చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా స్థలాల్లో ప్రచారానికి తెరదించారు. ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారంలో లౌడ్‌ స్పీకర్లు వినియోగించడాన్ని నిషేధించారు శేషన్.

1988లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంలో రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. బోఫోర్స్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ ప్రయోజనాలను కాపాడేందుకు ఆయన ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. 1989 మార్చిలో కేబినెట్‌ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఏడు నెలల తర్వాత అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ ఆయనను ప్రణాళికా సంఘం సభ్యుడిగా డిమోట్‌ చేశారు. ఆ తర్వాత చంద్రశేఖర్‌.. 1990 డిసెంబరులో శేషన్‌ను ఈసీ అధిపతిగా నియమించారు.

Recommended For You