సర్వత్రా ఉత్కంఠ.. టీఎస్‌ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు..

సర్వత్రా ఉత్కంఠ.. టీఎస్‌  ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు..

tsrtc-hc

టీఎస్‌ ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఎప్పుడు..? ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదు.. కార్మికులు డిమాండ్లపై వెనక్కు తగ్గడం లేదు.. అటు హైకోర్టులో కార్మిక సంఘాలు, ప్రభుత్వం ఎవరివాదన వారు వినిపిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు విచారణ జరిపిన హైకోర్టు.. ఆర్టీసీ యాజమాన్యం, అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సోమవారం జరిగే విచారణలో న్యాయస్థానం ఏం చెప్పబోతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

డిమాండ్ల సాధన కోసం అక్టోబర్‌ 5 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు ఆర్టీసీ కార్మికులు. ప్రతిష్టంభన అలాగే కొనసాగడంతో మధ్యలో హైకోర్టు జోక్యం చేసుకుంది. పలుమార్లు ఇరువర్గాల వాదనలు విన్నది. నివేదికలు తెప్పించుకుంది. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తరపున అఫిడవిట్లు సమర్పించిన IAS అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుల తడకగా.. పరస్పర విరుద్ధంగా, అవాస్తవాలతో కూడిన నివేదికలు ఇచ్చే ఇలాంటి అధికార్లను ఎప్పుడూ చూడలేదంటూ చీవాట్లు పెట్టింది. తప్పుడు లెక్కలతో రవాణాశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సరైన రిపోర్టులతో రావాలని ఆదేశించింది. దీంతో తమ నివేదికలను సోమవారం హైకోర్టుకు సమర్పించనున్నారు ఆర్టీసీ అధికారులు.

అటు ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ 17 సమీక్షలు చేశారు. కోర్టు వాదనలున్న ప్రతిసారి అధికారులతో రివ్యూ చేశారు. న్యాయస్థానంలో ఎలాంటి వాద‌న‌లు వినిపించాలో దిశానిర్దేశం చేశారు. అయినా విచార‌ణ స‌మ‌యంలో అనేక త‌ప్పిదాలు బ‌య‌ట‌ప‌డ‌టం.. ఇబ్బందిక‌రంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారని సమాచారం. ఈసారి విచారణలో మళ్లీ అదే పరిస్థితి తలెత్తకూడదని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, న‌ష్టాలు, భవిష్యత్‌లో ఏర్పడే ఇబ్బందులను కోర్టుకు స్పష్టంగా తెలపాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని నిధులిచ్చింది. కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనే నివేదికను కోర్టు ముందుంచాలని చెప్పారు. కార్మికుల స‌మ్మెతో ఏర్పడిన ఇబ్బందులు.. సంస్థకు ఎన్ని వంద‌ల కోట్ల న‌ష్టం వాటిల్లిందన్నది కూడా కోర్టుకు వివ‌రించాల‌ని చెప్పారు సీఎం కేసీఆర్. ఆర్టీసీలో ఉన్న 10 వేల 400 బ‌స్సుల్లో 2వేలు అద్దె బ‌స్సులు కాగా మ‌రో 3వేల బ‌స్సులకు ఫిట్‌నెస్‌ లేదని.. వాటి స్థానంలో కొత్తవి కొనే ఆర్థిక పరిస్థితి సంస్థ దగ్గర లేదన్న అంశాన్ని స్పష్టంగా కోర్టు ముందు ఉంచాలన్నారు. సంస్థను గట్టెక్కించాలంటే మరిన్ని అద్దెబస్సులతో పాటు 3వేల రూట్లలో ప్రైవేట్ వాళ్లకు పర్మిట్లు ఇవాల్సి వస్తుందన్నారు. కార్మికులు స‌మ్మె చేసినా చేయ‌కపోయినా ఈ సంస్కరణలు తీసుకోవాల్సిందేన‌న్న విషయాన్ని కోర్టుకు చెప్పాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం.

Tags

Read MoreRead Less
Next Story