ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై విచారణ వాయిదా

ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై విచారణ వాయిదా

hc

ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా పడింది. మొదట ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ సుదీర్ఘంగా సాగింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్‌ను ఉన్నత న్యాయస్థానం కోరింది.

ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్ ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. 2015లో మరోసారి ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. న్యాయవాది విద్యాసాగర్ తెలపగా.. పరిశీలించిన న్యాయస్థానం ఆ జీవో ఆరునెలల వరకే వర్తిస్తుందని పేర్కొంది. హైకోర్టు చట్టానికి అతీతం కాదని.. చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలపగా.. దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధిక ఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని.. ఈ విషయంలో ఏ ప్రాతిపదికన హైకోర్టు ఆదేశించగలదని ప్రశ్నించింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.

Tags

Read MoreRead Less
Next Story