ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడేది లేదు: పవన్

ka

వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. సీఎం జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన పవన్.. తానూ అదే రీతిలో మాట్లాడితే తలెత్తుకోగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదన్న జనసేనాని.. విజయవాడ రోడ్లపైనే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తే.. అందుకు రెడీగా ఉన్నామంటూ సవాల్ విసిరారు.

వైసీపీ, జనసేన మాటల యుద్ధం పీక్‌స్టేజ్‌కు చేరింది. విజయవాడలో జరిగిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకల్లో సీఎం జగన్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ భాషా సంస్కారాన్ని మర్చిపోయిన మాట్లాడినా.. తాను మాత్రం పాలసీలపైనే ప్రశ్నిస్తానని చెప్పారు. తాను 3 పెళ్లిల్లు చేసుకుంటే సీఎం జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. తల్చుకుంటే జగన్‌ కంటే ఎక్కువే వ్యక్తిగత విమర్శలు చేయగలనని అన్నారు పవన్. అలా చేస్తే ఆయన తలెత్తుకోగలరా అని ప్రశ్నించారు.

ఫ్యాకన్ రాజకీయాలు భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై బలంగా మాట్లాడుతాం.. బలంగా నిలబడుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజల దృష్టి మార్చేందుకే ఇసుక సంక్షోభం, ఇంగ్లీష్ మీడియం వంటి సమస్యలు సృష్టించారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఎంత సంస్కార హీనంగా మాట్లడినా.. తాము మాత్రం సంస్కారంతోనే మాట్లాడుతామని చెప్పారు. కాదు గొడవలే కావాలి.. విజయవాడ రోడ్లపై కొట్టుకోవాలి అనుకుంటే తామూ అందుకు కూడా రెడీ అన్నారు.

అంతకుముందు ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేనాని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై వినతిపత్రం ఇచ్చారు. దాదాపుగా అరగంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

Recommended For You