ప్రతి పనిలో జే ట్యాక్స్‌ కావాలా.. : చంద్రబాబు

ప్రతి పనిలో జే ట్యాక్స్‌ కావాలా.. : చంద్రబాబు

chandrababu

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యపై టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ ధర్నాచౌక లో చేపట్టిన నిరసన దీక్ష విజయవంతమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యకర్తలు,భవన నిర్మాణ కార్మికులు,వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలతో పాటు 19సంఘాల నేతలు స్వయంగా దీక్షలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. అంతా ఒక్కసారిగా రాకుండా 12గంటలూ దశలవారిగా మద్దతుదారులు దీక్షస్థలికి వచ్చేలా సమన్వయం చేయటంలో పార్టీ యంత్రాంగం సఫలమైంది. చంద్రబాబుకు నూలుదండ వేసి దీక్షకు కూర్చోపెట్టిన భవన నిర్మాణ కార్మికులే 12గంటల తర్వాత ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఉదయం నుంచి రాత్రి వరకూ దీక్షాస్థలికి జనాల తాకిడి నిర్విరామంగా సాగింది. ఇసుక కొరత కారణంగా.. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు ఉపాధి దొరికే వరకు వారికి నెలకు 10వేల రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. ప్రతి పనిలో జే ట్యాక్స్‌ కావాలా అని నిలదీశారు. ఇసుక దోచుకోవడానికి జగన్‌ మనుషుల్ని పెట్టారని ఆరోపించారు. సిమెంట్‌ కంపెనీలను కూడా బెదిరించారని, నెల రోజుల్లోపు సిమెంట్‌ ధర 110 రూపాయలు పెరగటం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. నిర్మాణ రంగంలో ఎవరికీ పనిలేకుండా పోయిందని, కార్మికులు అర్థ ఆకలితో అలమటిస్తుంటే.. సీఎం మాత్రం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమత్తారు. మద్యాన్ని నియంత్రించాల్సిన పోలీసులే.. మద్యం అమ్మకాల్లో బిజీ అయిపోయారని ఎద్దేవా చేశారు.

పేదవాడి ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ.. తనకు కావాల్సింది మాత్రం డబ్బే అన్న రీతిలో సీఎం వ్యవహరిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. 35 లక్షల కుటుంబాల కోసం తాము దీక్ష చేస్తుంటే పార్టీలోని ఇద్దరు నేతలను చేర్చుకుని తనపై విమర్శలకు చేయిస్తున్నరాంటూ మండిపడ్డారు. జగన్‌లాంటి కుటిల రాజకీయ నాయకుల్ని వేలమందిని చూశానన్న చంద్రబాబు.. వందమంది నాయకులను తయారు చేస్తానని స్పష్టం చేశారు.

కులం పేరుతో సమాజాన్ని విడదీయాలని.. జగన్ కుట్రపన్నుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను.. పవన్ నాయుడు అంటూ కులం అంటగట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తన నరనరాల్లో సామాజిక న్యాయం ఉందని స్పష్టం చేశారు. గంగా నదిలో మునిగి.. ఓట్లు వేయించుకుంటే సరిపోతుందా అని నిలదీశారు. తిరుపతి, శ్రీశైలం, అన్నవరం ఆలయాల్లో అన్యమత ప్రచారాలు జరగడం సరికాదని హితవు పలికారు.

దీక్షకు సంఘీభావంగా హాజరైన జనసేన, ఆమ్ ఆద్మీ, లోక్ సత్తా నాయకులతో పాటు.. సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు, ఇతర అన్ని వర్గాల వారికి చంద్రబాబు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన దీక్షకు అందరి నుంచి మద్దతు లభించిందని హర్షం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story